సాక్షి, విశాఖపట్నం: బీజేపీ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ పీవీ చలపతిరావు (87) కన్నుమూశారు. విశాఖ నగరంలోని పిఠాపురం కాలనీ లో ఉంటున్న ఆయన కొంతకాలంగా వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురవడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఆయనకు భార్య రాధమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు పి.వి.ఎన్.మాధవ్ ఉత్త రాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా కొసాగుతున్నారు. 1935 జూన్ 26న జన్మించిన చలపతిరావు పదేళ్ల వయసులోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరి చురుకైన పాత్ర పోషించారు. 1956 నుంచి 1966 వరకు పారిశ్రామిక విస్తరణ అధికారిగా ఉన్న ఆయన ఎన్నికల్లో పోటీచేసేందుకు ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1967 నుంచి విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొన్నారు. 1973లో ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించి పలుమార్లు అరెస్టయ్యారు.
ఎమర్జెన్సీ కాలంలో లోక సంఘర్షణ సమితి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఆయన 19 నెలలు అజ్ఞాతంలో గడిపారు. ట్రేడ్ యూనియన్ల నేతగాను పనిచేసి కార్మికులు, పారిశ్రామిక సంబంధాలను సమన్వయం చేసినందుకు ప్రభుత్వం నుంచి శ్రమశక్తి అవార్డు పొందారు. 1980 నుంచి 1986 వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయన ఉత్తర సర్కారు జిల్లాల గ్రా డ్యుయేట్ నియోజకవర్గం నుంచి 1974లోను, 1980లోను శాసనమండలికి ఎన్నికయ్యారు. చలపతిరావు పార్ధివదేహాన్ని ఆయన స్వగృహంలో ఉంచారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చలపతిరావు మృతికి హరియాణ గవర్నర్ బి.దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జి.వి.ఎల్.నరసింహారావు సంతాపం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment