సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫైబర్‌నెట్ కుంభకోణం కేసు దర్యాప్తులో సీఐడీ వేగం పెంచింది. నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ కంపెనీకి ఫైబర్ నెట్ టెండర్లను కట్టబెట్టిన ఆ కేసులో తదుపరి చర్యలకు ఉపక్రమించింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సన్నిహితుడు వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీతోపాటు ఈ కేసులో కీలకపాత్ర పోషించిన చంద్రబాబు సన్నిహితుల ఆస్తులను అటాచ్ చేయాలని నిర్ణయించింది.
టెరాసాఫ్ట్ కంపెనీ, చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలన్న సీఐడీ ప్రతిపాదనకు రాష్ట్ర హోంశాఖ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటాచ్ ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ఉన్నాయి. హోంశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో ఆ స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని కోరుతూ సీఐడీ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేయనుంది.
కోర్టు అనుమతి అనంతరం ఆ ఆస్తుల అటాచ్‌మెంట్ ప్రక్రియను చేపడుతుంది. రూ. 330 కోట్లతో చేపట్టిన ఫైబర్‌నెట్ మొదటి దశ ప్రాజెక్ట్ కాంట్రాక్టును టెరాసాఫ్ట్ కంపెనీకి చంద్రబాబు అడ్డగోలుగా కట్టబెట్టేసిన విషయం తెలిసిందే. బ్లాక్ లిస్టులో ఉన్న ఆ కంపెనీపై నిషేధం తొలగించి ఏకపక్షంగా టెండరు ఖరారు చేశారు. ఏపీ గవర్నింగ్ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్న వేమూరి హరికృష్ణను ఈ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా నియమించారు. ఆయనకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీయే టెండర్లలో పాల్గొంది. అంటే పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి మరీ కథ నడిపించారు. ఈ వ్యవహారంలో రూ. 144.53 కోట్లు ముడుపుల రూపంలో కొల్లగొట్టినట్టు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది.
ఫైబర్‌నెట్ కేసులో అటాచ్‌కు నిర్ణయించిన ఆస్తులు
– ఈ కేసులో నిందితుడు కనుమూరి కోటేశ్వరరావు పేరిట గుంటూరులో ఉన్న 797 చ.అడుగుల విస్తీర్ణం గల ఇంటి స్థలం
– నిందితుడు కనుమూరి కోటేశ్వరరావు డైరెక్టర్‌గా ఉన్న నెప్‌టాప్స్ ఫైబర్ సొల్యూషన్స్‌కు చెందిన విశాఖపట్నం కిర్లంపూడి లేఅవుట్‌లోని ఓ ఫ్లాట్
– టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ టి.గోపీచంద్ పేరిట హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న ఫ్లాట్
– టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ టి.గోపీచంద్ పేరిట హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉన్న ఫ్లాట్
– టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ టి.గోపీచంద్ పేరిట హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉన్న మరో ఫ్లాట్
– ఈ కేసులో నిందితుడు తుమ్మల గోపీచంద్ పేరిట హైదరాబాద్ యూసఫ్‌గూడలో ఉన్న ఫ్లాట్
– తుమ్మల గోపీచంద్ భార్య పవనదేవి పేరిట తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఉన్న వ్యవసాయ భూమి
Comments
Please login to add a commentAdd a comment