సారూ.. ఫీజు డబ్బులివ్వరూ.. | Colleges saying they will not give certificates if fees are not paid | Sakshi
Sakshi News home page

సారూ.. ఫీజు డబ్బులివ్వరూ..

Published Sat, Jun 29 2024 5:04 AM | Last Updated on Sat, Jun 29 2024 12:45 PM

Colleges saying they will not give certificates if fees are not paid

విద్యా, వసతి దీవెనలకు మంగళం!

షెడ్యూల్‌ ప్రకారం జూన్‌లో ఇవ్వాల్సి ఉన్నా ఊసెత్తని ప్రభుత్వం

విద్యా దీవెన కింద సుమారు రూ.708.68 కోట్లు 

ఫీజులు చెల్లించకుంటే సర్టిఫికెట్లు ఇవ్వం అంటున్న కాలేజీలు

దాదాపు 9.44 లక్షల మందికి చెల్లించాల్సిన నిధులపై స్పందన కరువు.. సుమారు 9.55 లక్షల మందికి రూ.600 కోట్ల వసతి దీవెన పైనా అదే తీరు

తీవ్ర ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐటీఐ నుంచి ఐఐటీ, వైద్య విద్య వరకు చదువుకునే విద్యార్థులకు చెల్లించాల్సిన విద్యా దీవెన, వసతి దీవెనపై సర్కారు స్పందన కరవైంది. గత ప్రభుత్వం ఏటా మూడు నెలల (త్రైమాసికం)కు ఒకసారి జగనన్న విద్యా దీవెన చెల్లించగా, ఆరు నెలలకు ఒకసారి జగనన్న వసతి దీవెన చెల్లించేది. ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ రెండో వారంలో దాదాపు 9.44 లక్షల మంది విద్యార్థులకు జనవరి– ఏప్రిల్‌ నెలలకు విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లు జమ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

అలాగే ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ప్రతి విద్యా సంవత్సరం జూన్‌లో, ఆ తర్వాత ఏప్రిల్లో రెండు వాయిదాల్లో జగనన్న వసతి దీవెన అందించేవారు. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర విద్యార్థులకు రూ.20 వేల చొప్పున చెల్లించేవారు. అయితే, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనా, ప్రభుత్వం ఫీజులను ఇప్పటి వరకు విడుదల చేయలేదు. దీంతో కళాశాలలు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

ఇకపై విద్యార్థులు కట్టే ఫీజులను నేరుగా కళాశాలల ఖాతాల్లోనే జమ చేస్తామని కొత్త ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ముగిసిన విద్యా సంవత్సరం ఫీజులపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం ద్వారా వాటికి మంగళం పాడినట్టేనని తెలుస్తోంది. పేద విద్యార్థుల చదువులకు బాసటగా నిలుస్తూ నూరు శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందించేందుకు గత జగన్‌ ప్రభుత్వం విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించింది. క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ వచ్చింది. 

ఈ క్రమంలో 2023 అక్టోబర్‌– డిసెంబర్‌ త్రైమాసికానికి 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ రూ.708.68 కోట్లను మార్చి ఒకటో తేదీన విద్యార్థులు–తల్లుల ఉమ్మడి ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు జనవరి–ఏప్రిల్‌ మాసాలకు చెల్లించాల్సిన నిధులపై ఎలాంటి స్పందన లేదు. అలాగే దాదాపు 9.55 లక్ష మంది విద్యార్థులకు వసతి దీవెన కింద ఇవ్వాల్సిన సుమారు రూ.600 కోట్లపై ఎలాంటి నిర్ణయం ప్రకటించ లేదు.  

విద్యా దీవెనపై 93 శాతం మంది చదువులు 
రాష్ట్రంలో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సుల్లోని 93 శాతం మంది విద్యార్థులు ‘విద్యా దీవెన‘ ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తీసుకుంటూ చదువుకుంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వం కాలేజీ విద్యకు ఫీజు ఎంత ఉన్నా రూ.35 వేలు మాత్రమే చెల్లించేది. ఇక వసతి దీవెన మాటే లేదు. ఫీజుల కోసం నాడు విద్యార్థుల తల్లిదండ్రులు ఇళ్లు, పొలాలు అమ్ముకునే పరిస్థితి. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అర్హత గల ప్రతి విద్యార్థికీ ఫీజు ఎంత ఉన్నా నూరు శాతం చెల్లించారు. 

జవాబుదారీ తనం పెంచేలా, పారదర్శకంగా తల్లి, విద్యార్థి ఉమ్మడి బ్యాంకు ఖాతాల్లో త్రైమాసికానికోసారి విద్యా దీవెనను జమ చేశారు. అనంతరం వారు ఆ ఫీజును కళాశాలకు చెల్లించే వారు. అలా ఇప్పటిదాకా 27 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.18,576 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలతో కలిపి) చెల్లించారు. ఏటా సగటున విద్యా దీవెన కింద రూ.2,835 కోట్లు, వసతి దీవెన కింద అత్యధికంగా రూ.1068.94 కోట్లు చెల్లించారు.  

గత టీడీపీ పాలనా పరిస్థితులే తిరిగి ఉత్పన్నం!
గత టీడీపీ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సక్రమంగా అమలు కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అనేక అవస్థలు పడ్డారు. ప్రభుత్వం కాలేజీలకు సకాలంలో ఫీజులు చెల్లించక పోవడంతో యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచేవి. పరీక్షలకు హాల్‌టికెట్లు, పాసైతే సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవి. ఫలితంగా చాలా కుటుంబాలు అప్పులు చేసి తమ పిల్లల ఫీజులు చెల్లించారు. కళాశాలల ఫీజు కంటే తక్కువ ఫీజు రీయింబర్స్‌ చేయడంతో పేద విద్యార్థుల కుటుంబాలపై మోయలేని ఆర్థిక భారం పడేది. 

మిగిలిన డబ్బు విద్యార్థులే చెల్లించాల్సిన పరిస్థితి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఫీజు ఎంతున్నా 100 శాతం రీయింబర్స్‌ చేయడంతో విద్యార్థులు నిశ్చింతగా చదువుకోగలిగారు. పైగా అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం 2017–19 మధ్య 16.73 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన రూ.1,778 కోట్లు సైతం జగన్‌ ప్రభుత్వం చెల్లించింది. ప్రభుత్వ వివరాల ప్రకారం 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద సగటున ఏడాదికి రూ.2066 కోట్లు, హాస్టల్‌ ఖర్చుల కింద రూ.362 కోట్లు మాత్రమే చెల్లించగా, జగన్‌ ప్రభుత్వం ఏడాదికి రూ.4,044 కోట్లు అందించింది. 

కొత్త ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెనపై ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడం ద్వారా ఇక ఇచ్చే ప్రసక్తి లేదన్న సంకేతాలు పంపుతున్నట్టు విద్యా రంగ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే విద్యార్థుల తల్లిందండ్రులు అప్పుల పాలవ్వడం ఖాయం. 

వసతి దీవెన సొమ్ము ఎప్పుడిస్తారో..
గత రెండేళ్లుగా నాకు జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఏటా రూ.20 వేలు అందింది. ఈ విద్యా సంవత్సరం అందాల్సిన సొమ్ము కోసం ఎదురు చూస్తున్నాం. ఇంతవరకు విధివిధానాలు ఏవీలేవు. గతంలో నేరుగా మా వివరాలు గ్రామ సచివాలయానికి వచ్చేవి. నేరుగా మాకు ఉపకార వేతనాలు అందేవి. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలియని పరిస్థితి. అకడమిక్‌ ఇయర్‌ ప్రారంభమైంది. పుస్తకాలు, యూనిఫాం కొనుగోలుకు డబ్బుల అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో చెప్పక పోవడం ఆందోళన కలిగిస్తోంది.   – తాడ్డి వెంకటేష్, డిగ్రీ తృతీయ సంవత్సరం, లక్ష్మీపురం, రాజాం మండలం, విజయనగరం జిల్లా 
 

పిల్లల ఫీజులు కట్టేదెట్టా?
నాకు ఇద్దరు పిల్లలు. ఒకరికి అమ్మఒడి, ఒకరికి విద్యా దీవెన పథకాల కింద జగనన్న ప్రభుత్వంలో వారి చదువులకు ఎలాంటి భారం లేకుండా ఆర్థిక భరోసా కల్పించారు. ఈ సంవత్సరం ఇంకా లబ్ధి పడలేదు. దీంతో మా పిల్లల చదువులకు సంబంధించి ఫీజులు కట్టడం భారంగా మారింది. మేం రోజూ కూలి పనులు చేసుకుంటే కానీ జీవనం సాగించలేని పరిస్థితి. ప్రభుత్వం స్పందించి పిల్లల విద్యోన్నతి పథకాలను కొనసాగించి మాకు అండగా నిలవాలి. – స్వర్ణలత, కరకంబాడి, రేణిగుంట మండలం, తిరుపతి జిల్లా 

హాస్టల్‌ ఫీజు అడుగుతున్నారు..
నేను ఎస్వీ యూనివర్సిటీలోని హాస్టల్‌లో ఉంటూ విదేశీ భాషా శాస్త్రం (ఎంఏ లింగ్విస్టిక్స్‌) పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమైనప్పటికీ ప్రభుత్వం అందిస్తున్న వసతి దీవెనతోనే ఇక్కడ హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నాను. 

గతంలో వసతి దీవెన సకాలంలో అందుతుండడంతో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ ఏడాది ఇప్పటి వరకు వసతి దీవెన అందకపోవడంతో యూనివర్సిటీ వారు హాస్టల్‌ ఫీజు చెల్లించాలని అడుగుతున్నారు. ఇది నాలాంటి వారికి చాలా ఇబ్బంది. వెంటనే ప్రభుత్వం వసతి దీవెన చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలి. – మన్నం ప్రేమ్‌కుమార్, పీజీ విద్యార్థి, ఎస్వీ యూనివర్సిటీ, తిరుపతి

ఫీజులు కట్టమని ఇబ్బందులు పెడుతున్నారు
నేను చిత్తూరు జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎస్వీసెట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్నా. మొన్నటి వరకు సకాలంలో విద్యా దీవెన పథకం వల్ల లబ్ధి కలిగింది. ఈ ఏడాది విద్యా దీవెన నగదు ఇంకా విడుదల చేయలేదు. కళాశాలలేమో ప్రారంభం అయ్యాయి. ఫీజు చెల్లించాలంటూ యాజమాన్యం రోజూ అడుగుతూనే ఉంది. కోర్సు ఫీజు చెల్లించాలని ఇంట్లో చెప్పాను. అప్పు చేసి డబ్బులు తెచ్చి ఇవ్వడానికి అమ్మానాన్నలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం చొరవ చూపి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నగదును వెంటనే విడుదల చేయాలి.  – గౌతమ్, ఇంజనీరింగ్‌ విద్యార్థి, వావిల్‌తోట, పూతలపట్టు నియోజకవర్గం, చిత్తూరు జిల్లా. 

వసతి డబ్బులు త్వరగా ఇవ్వాలి
నా కుమారుడు పలమనేరు పట్టణంలోని ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ మూడవ సంవత్సరం హాస్టల్‌లో ఉండి చదువుతున్నాడు. మా అబ్బాయికి గత రెండు సంవత్సరాలు వసతి దీవెన పథకం కింద రూ.40 వేలు ఇచ్చారు. ఆ నగదును కళాశాల వసతి ఖర్చులకు చెల్లించేవాళ్లం. కూలీ పనులు చేస్తే గాని మా పూట గడవదు.

ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుండడంతో మాకు ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఎప్పుడు నగదు ఇస్తారో తెలియడం లేదు. నా బిడ్డ చదువు ఆగిపోకుండా వడ్డీకి డబ్బులు తీసుకుని ఫీజు చెల్లించాం. ప్రస్తుత పాలకులు మా బాధను అర్థం చేసుకుని త్వరగా నగదు జమ చేయాలని కోరుతున్నాం.  – వరలక్ష్మి, విద్యార్థి తల్లి, ములతిమ్మేపల్లి, బైరెడ్డిపల్లి మండలం, పలమనేరు, చిత్తూరు జిల్లా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement