Fact Check: వాస్తవాలకు మసిపూసి ‘ఈనాడు’ విష ప్రచారం   | 'Enadu is a poisonous campaign that hides the facts | Sakshi
Sakshi News home page

Fact Check: వాస్తవాలకు మసిపూసి ‘ఈనాడు’ విష ప్రచారం  

Published Sat, Jun 10 2023 4:49 AM | Last Updated on Sat, Jun 10 2023 2:30 PM

'Enadu is a poisonous campaign that hides the facts - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి రైతుకు విత్తు నుంచి విక్రయం వరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోంది. వారు పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు దక్కేలా కృషి చేస్తోంది. ఏ సీజన్‌కు ఆ సీజన్‌ ముందుగానే విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను గ్రామ స్థాయిలోనే రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ద్వారా అందిస్తోంది. దీంతో రైతులపై రవాణా చార్జీల భారం తప్పింది.

గతంలో ఎన్నడూ లేని విధంగా కామన్‌ వెరైటీ, గ్రేడ్‌–ఏ రకాల ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తూ బాసటగా నిలుస్తోంది. ఇలా ప్రతి దశలోనూ రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంటే వాస్తవాలకు ముసుగేసి ‘ఈనాడు’ తనదైన శైలిలో విషం చిమ్ముతోంది. ప్రభుత్వ సహకారాన్ని ప్రస్తావించకుండా, ఇతర రాష్ట్రాల్లో బోనస్‌ అంటూ రైతులను తప్పుదోవ పట్టించేలా ‘వరి రైతుకు మిగిలేదేంటి?’ శీర్షికన ఓ కథనాన్ని వండివార్చింది. ఇందులో నిజానిజాల్లోకి వెళితే..
 
ఆరోపణ: 2022–23లో 9 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గింది. 
వాస్తవం: రాష్ట్రంలో వరి సాధారణ విస్తీర్ణం ఖరీఫ్‌లో 38.8 లక్షల ఎకరాలు, రబీలో 19.92 లక్షల  ఎకరాలు.. అంటే మొత్తం విస్తీర్ణం 58.72 లక్షల ఎకరాలు. కాగా 55.52 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అంటే వ్యత్యాసం 3.20 లక్షల ఎకరాలు. రబీలో బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటలను ప్రభుత్వం ప్రోత్సహించడంతో 1.15 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు, 50 వేల ఎకరాల్లో చిరుధాన్యాలు, మొక్కజొన్న, నూనెగింజల సాగు విస్తీర్ణం పెరిగింది. మరో 35 వేల ఎకరాల్లో మత్స్య సాగు విస్తరించింది.  మిగిలిన భూమిని ఇళ్ల స్థలాల కోసం సేకరించారు. వాస్తవం ఇలా ఉంటే ఏకంగా 9 లక్షల  ఎకరాలు తగ్గిపోయిందంటూ ‘ఈనాడు’ వక్రభాష్యం చెప్పింది. 

ఆరోపణ: క్వింటా రూ.3,126 ప్రతిపాదిస్తే ఎందుకు తగ్గించారు? 
వాస్తవం: పెట్టుబడి ఖర్చుల ఆధారంగా దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు పంటల వారీగా కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని ప్రతిపాదిస్తాయి. ఇలా మన రాష్ట్రంలో ఖరీఫ్‌లో ఎకరాకు రూ.32 వేలు, రబీలో రూ.41 వేలు ఖర్చవుతుందన్న అంచనాతో క్వింటా రూ.3,126గా  ఎంఎస్పీ నిర్ణయించాలని కేంద్రానికి నివేదిక పంపింది.

ఇదే రీతిలో  పంటల వారీగా ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో రీతిలో వచ్చే ప్రతిపాదనలన్నీ క్రోడీకరించుకొని పంట కాలానికయ్యే సాగు ఖర్చును సరాసరి లెక్కించి పంటల వారీగా అన్ని రాష్ట్రాలకు ఒకే రకమైన మద్దతు ధరను కేంద్రం ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. అదే రీతిలో 2023–24 సీజన్‌కు సాధారణ రకానికి క్వింటాకు రూ.2,183, గ్రేడ్‌–ఏ రకానికి రూ.2,203గా కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ విధి ప్రతిపాదనలు పంపించడం వరకే. నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదేనన్న విషయం రామోజీకి తెలియనట్లుంది కాబోలు.  

ఆరోపణ: బోనస్‌ ఇవ్వాలన్న ఆలోచనే మరిచారు 
వాస్తవం: కేరళ, తమిళనాడు, జార్ఖండ్‌ వరికి బోనస్‌ ఇస్తున్నాయంటూ ‘ఈనాడు’ కొత్త వాదన తీసుకొ చ్చింది. మరి బోనస్‌ ఇస్తున్నా ఆయా రాష్ట్రాల్లో వరి సాగు ఎందుకు పెరగడం లేదు? ఏపీలో 24 లక్షల హెక్టార్లలో వరి సాగవుతుంటే కేరళలో 1.98 లక్షల హెక్టార్లు, జార్ఖండ్‌లో 13.57 లక్షల హెక్టార్లు, తమిళనాడులో 19 లక్షల హెక్టార్లలో మాత్రమే వరిసాగవుతోంది. ఇక దిగుబడిని పరిశీలిస్తే ఏపీలో ఎకరాకు 23.24 క్వింటాళ్ల్ల దిగుబడి (2022–23) వస్తుంటే, తమిళనాడులో 17, జార్ఖండ్‌లో 9, కేరళలో 13 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోంది.

ఆయా రాష్ట్రాల్లో ఎంతగా ప్రోత్సహిస్తున్నా, వరిసాగు కంటే ఎక్కువ ఆదాయం వచ్చే పంటల వైపు అక్కడి రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగానే కేరళ.. ఏటా మన గోదావరి జిల్లాల్లో సాగయ్యే బోండాల కోసం క్యూ కడుతుంటే, తమిళనాడు.. రాయలసీమ జిల్లాల్లో సాగయ్యే ఫైన్‌ వెరైటీ, జార్ఖండ్‌.. ఉత్తరాంధ్రలో సాగయ్యే ఫైన్‌ వెరైటీ ధాన్యం కొనుగోలుకు ఎగబడుతున్నాయి.

సాధారణంగా డిమాండ్‌ కంటే తక్కువ ఉత్పత్తి ఉన్న పంటల సాగును ప్రోత్సహించాలన్న సంకల్పంతోనే బోనస్‌ ప్రకటిస్తుంటారు. మన రాష్ట్రంలో డిమాండ్‌కు మించి ఉత్పత్తి జరుగుతోంది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క సీజన్‌లో కూడా ఒక్క రూపాయి బోనస్‌ ప్రకటించిన పాపాన పోలేదు. అయినా ఇదేంటని రామోజీ అప్పట్లో ఏనాడైనా ప్రశ్నించారా?

ఆరోపణ: మిల్లర్లకు ఎదురు సొమ్ము ఇవ్వాల్సి వస్తోంది 
వాస్తవం: గత ప్రభుత్వ హయాంలో మిల్లర్లు, దళారీల కనుసన్నల్లోనే ఎమ్మెస్పీ కంటే తక్కువ ధరకే ధాన్యం సేకరణ జరిగేది. ఏనాడూ ఏ ఒక్క రైతుకు కూడా ఎమ్మెస్పీ దక్కిన దాఖలాలు లేవు. కానీ నేడు దళారీలు, మిల్లర్ల ప్రమేయం కూడా లేకుండా ప్రతి గింజను కనీస మద్దతు ధరకే ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది.

ఇందుకోసం ఆర్బీకేలన్నింటిని ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా గుర్తించింది. నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తోంది. కొనుగోలు చేసిన ధాన్యంలో మంచి రకాలను ఎంపిక చేసి అదనపు ఖర్చుల కింద క్వింటాకు రూ.110 వెచ్చించి నాణ్యమైన బియ్యంగా మార్చి కార్డుదారులకు ఇంటి వద్దే అందిస్తోంది. ఇవేమీ ‘ఈనాడు’కు కనిపించడం లేదు.  

ఆరోపణ: వరి రైతుకు కనీస మద్దతు ధర దక్కడం లేదు 
వాస్తవం: చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 17,94,279 మంది రైతుల నుంచి రూ.40,237 కోట్ల విలువైన 2,65,10,747 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. బాబు హయాంలో తక్కువ మంది రైతుల వద్ద నుంచి ఎక్కువ మొత్తం ధాన్యం సేకరించేవారు. ఉదాహరణకు 2014–15లో 1.18 లక్షల మంది రైతుల నుంచి రూ.5,583 కోట్ల విలువైన 40.62 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు.

నూటికి 90 శాతం సన్న, చిన్నకారు రైతులున్న ఈ రాష్ట్రంలో ఈ స్థాయిలో ధాన్యం అమ్మారంటే వార్ని ఏమంటారో అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు రాష్ట్రంలో గత నాలుగేళ్లలో ఏకంగా 32,76,354 మంది రైతుల నుంచి రూ.58,739 కోట్ల విలువైన 3,10,56,117 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. గతంతో పోలిస్తే ధాన్యం అమ్ముకున్న రైతుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది.  

ఆరోపణ: అమ్మాలంటే అగచాట్లు 
వాస్తవం: గత ప్రభుత్వ హయాంలో రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని బస్తా (75 కిలోలు)కు మద్దతు ధర కంటే రూ.200 నుంచి రూ.500 వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరాకు తక్కువలో తక్కువ 30–33 బస్తాల దిగుబడి వేసుకున్నా రూ.6 వేలకు పైగా రైతులు నష్టపోయేవారు.

అంతేకాకుండా దళారులు, వ్యాపారులు తేమ శాతం పేరిట ఇష్టమొచ్చినట్టు కోత పెట్టేవారు. కానీ ప్రస్తుతం జిల్లాకో మొబైల్‌ మిల్లును పంపి రైతుల ఎదుటే శాంపిల్స్‌ పరీక్షించి మరీ కొనుగోలు చేశారు. ముక్క విరుగుడు ధాన్యాన్ని బాయిల్డ్‌ రకంగా పరిగణించి మరీ కొన్నారు. గత ఖరీఫ్‌ సీజన్‌లో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను తేమ, నూక శాతాలతో సంబంధం లేకుండా కొనుగోలు చేసి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది.   

బోనస్‌కు మించి జీఎల్‌టీ 
రైతు ప్రయోజనార్థం రైతు భరోసా  కేంద్రాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రంగా గుర్తించింది.  అంతటితో ఆగకుండా రైతు పొలం నుంచే నేరుగా కొనుగోలు చేసేందుకు అదనపు ఖర్చులు భరించింది.   మునుపెన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోలులో గోనె సంచులు, హమాలి.. రవాణా చార్జీలు మద్దతు ధరతో పాటు కలిపి చెల్లిస్తోంది. ఒక్కో గోనె సంచి ఖరీదు రూ.70.

ఈ లెక్కన ఒక టన్ను ధాన్యం నిల్వ చేసేందుకు గోనె సంచుల కోసం రూ.1,750 ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది. హమాలి ఖర్చు టన్నుకు రూ.220, రవాణాకు రూ.468 (25 కి.మీ పరిధిలో) చొప్పున.. మొత్తంగా టన్నుకు రూ.2,523 చొప్పున ప్రభుత్వం జీఎల్‌టీ (గన్నీ బాగులు, లేబర్, ట్రాన్స్‌పోర్ట్‌) రూపంలో ఖర్చు చేస్తోంది. ఈ మొత్తం ధాన్యం కొనుగోలు సొమ్ముతో కలిపి రైతు ఖాతాల్లో జమ చేస్తోంది.
చదవండి: Fact Check: అసత్యాల్లో నిండా మునిగిన ‘ఈనాడు’

ఇది ఆయా రాష్ట్రాల్లో ఇచ్చే బోనస్‌తో పోల్చుకుంటే చాలా ఎక్కువ. పైగా పక్క రాష్ట్రాల్లో పరిమితికి లోబడే కొనుగోలు చేస్తారు. మన రాష్ట్రంలో మాత్రం ఆర్బీకే వద్దకు వచ్చిన ప్రతి రైతు నుంచి ఈ–క్రాప్‌ ఆధారంగా ధాన్యం కొనుగోలు చేస్తుండటం బహిరంగ రహస్యం. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోని ఈనాడు ప్రభుత్వంపై పనిగట్టుకుని బురద చల్లడమే లక్ష్యంగా అర్ధసత్య కథనాలు ఎవరి కోసం రాస్తోంది? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement