సాక్షి, అమరావతి: అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ చట్ట సవరణ చేసిన ప్రభుత్వం.. దాన్ని వేగంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయగా, ఎప్పటిలోగా పూర్తి చేయాలనే విషయంపై తాజాగా అధికార యంత్రాంగానికి టైం లైన్ నిర్దేశించింది.
నెల రోజుల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కసరత్తు ముగించి అసైన్‌మెంట్ జరిగి 20 సంవత్సరాలు పూర్తయిన అసైన్డ్ భూములను నిషేధిత ఆస్తుల జాబితా (22)ఏ నుంచి తొలగించాలని ఆదేశించింది.
అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ చట్ట సవరణ చేసిన గత నెల 31వ తేదీకి ఈ భూములు సంబంధిత రైతులు, వారి వారసులు లేదా లీగల్ హైర్స్ ఆదీనంలో ఉంటే వారికి యాజమాన్య హక్కులు లభిస్తాయి. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్ జి. సాయిప్రసాద్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.
వారం నుంచి నెల రోజుల గడువు
రైతుకు కేటాయించి 20 సంవత్సరాలు పూర్తయిన అసైన్డ్ భూములను 22 (ఎ) నుంచి తొలగించేందుకు వీఆర్‌వో నుంచి తహశీల్దార్, జేసీ, కలెక్టర్లు చేయాల్సిన పనులను కూడా వివరిస్తూ ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఇప్పుడు 50 ఎకరాల వరకు అసైన్డ్ భూములున్న గ్రామాల్లో వారం రోజుల్లో వాటిని 22(ఎ) నుంచి తొలగించాలని సూచించింది.
150 వరకు ఉంటే రెండు వారాలు, 250 ఎకరాలు ఉంటే మూడు వారాలు, 250 ఎకరాలకు పైబడి అసైన్డ్ భూములుంటే నాలుగు వారాల్లో (నెల రోజుల్లో) ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని స్పష్టం చేసింది. ఈ గడువు ప్రకారం పని జరిగేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై రైతులకు యాజమాన్య హక్కులు లభిస్తాయి. ఈ భూములపై హక్కులు ఇవ్వాలని అనేక సంవత్సరాలుగా కోరుతున్న 15 లక్షల మందికిపైగా రైతులు లబ్ధి పొందనున్నారు. వారిలో మెజారిటీ రైతులు దళితులే.
Comments
Please login to add a commentAdd a comment