సాక్షి, విజయవాడ : మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళల్ని సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా శక్తివంతులను చేసే కార్యక్రమాలు చేపడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మహిళా పక్షపాతిగా ఇప్పటికే ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులలో విధిగా 50శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించారని తెలిపారు. మహిళలకు సామాజిక భద్రత కల్పించడం కోసం దిశ, దశలవారీగా మద్య నియంత్రణ వంటి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. అమ్మఒడి వంటి అద్భుత పథకంతో మహిళ స్వావలంబనకు మార్గం నిర్దేశం చేశారని తెలిపారు.
వైఎస్సార్ చేయూత ద్వారా ప్రభుత్వం 23 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క, చెల్లెమ్మలకు 4,312 కోట్ల రూపాయలను అందించిందన్నారు.జగనన్న ఆసరా పేరిట సుమారు కోటి మంది మహిళలకు, డ్వాక్రా అక్కచెల్లమ్మలకు నాలుగు దఫాలుగా నిధుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారని వెల్లడించారు. ఒక్కో విడతలో 6700 కోట్ల రూపాయల చొప్పున మొత్తం రూ. 26,800 కోట్లను నేరుగా మహిళలకు ఇవ్వనున్నారని తెలిపారు. వైఎస్సార్ ఆసరా పథకంలో మొదటి విడత నిధుల పంపిణీ ఈ నెల 11వ తేదీన ప్రారంభం కానుంది. ఇంత మంచి కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని 11వ తేదీ నుంచి గ్రామ గ్రామాన, పట్టణంలోని ప్రతి వార్డులో పెద్ద ఎత్తున ఆనందోత్సాహాలతో మహిళా వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment