ద్వారకాతిరుమల: పచ్చమూక మరోసారి రెచ్చిపోయింది. పోలీసులపై దాడులకు తెగబడింది. పోలీసుల్ని కిందకు తోసేసింది. తెలుగుదేశం వర్గీయులు విచక్షణారహితంగా ప్రవర్తించడంతో శుక్రవారం ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెం శివారులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కి బెయిల్ రావాలని కోరుతూ టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు మారంపల్లి నుంచి పాదయాత్రగా ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి బయల్దేరారు.
144 సెక్షన్ అమలులో ఉండటంతో తిరుమలంపాలెం శివారులో ద్వారకాతిరుమల, భీమడోలు పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు, పాదయాత్రలు వంటివి చేయకూడదని హెచ్చరించారు. అయినా టీడీపీ వర్గీయులు పోలీసులను నెట్టుకుంటూ దాడులు, దౌర్జన్యాలు చేస్తూ, బెదిరిస్తూ దూసుకెళ్లారు.
ఎవరడ్డొచ్చినా ఆగేది లేదంటూ.. పోలీసులను నోటికొచ్చినట్టు తిడుతూ ముందుకెళ్లారు. వారు తోసేయడంతో భీమడోలు సీఐ వి.వెంకటేశ్వరరావు, ద్వారకాతిరుమల హెడ్ కానిస్టేబుల్ అమీర్ కింద పడిపోయారు. అక్కడ పలువురు పలువురు టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం తిమ్మాపురం శివారులో టీడీపీ పాదయాత్రకు జనసేన నాయకులు మద్దతిచ్చి, వారితో కలసి ద్వారకాతిరుమల చేరుకున్నారు.
పథకం ప్రకారం మహిళలను ముందుపెట్టి..
టీడీపీ నేతలు పథకం ప్రకారం మహిళలను ముందుపెట్టి వెనుక వారొచ్చారు. మహిళలను అడ్డుకుంటారా.. అంటూ పోలీసులను తోసుకుంటూ దౌర్జన్యంగా దూసుకెళ్లారు. పోలీసులపై దాడులు, దౌర్జన్యాలకు తెగబడ్డారు. పోలీసులు మధ్యలో అడ్డుకుంటారని తెలిసినా, అల్లర్లు సృష్టించి, గొడవలు పెట్టుకోవాలనే వారు ఈ పాదయాత్రను చేపట్టినట్టు తెలిసింది. పోలీసుల పట్ల తెలుగుదేశం వర్గీయుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.
పలువురు టీడీపీ నాయకులపై కేసు
పోలీసులపై దౌర్జన్యం చేసి, 144 సెక్షన్ నిబంధనలను ఉల్లంఘించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన పలువురు టీడీపీ నాయకులపై ద్వారకాతిరుమల ఎస్‌ఐ టి.సుదీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు హెడ్ కానిస్టేబుల్ జి.దుర్గారావు తెలిపారు. ఇప్పటికే 13 మందిని అదుపులోకి తీసుకున్నామని, వారికి 41 నోటీసులు ఇచ్చి విడుదల చేశామని చెప్పారు. మరికొంతమందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment