సాక్షి, అమరావతి: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని గతంలోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయనను క్రైస్తవ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉందన్న విషయం మీకు కూడా తెలిసిందేనన్నారు. కాగా చాలాచోట్ల శ్మశాన వాటికల సమస్య ఉందని.. దీన్ని పరిష్కరించాలని క్రైస్తవ ప్రతినిధులు సీఎంకు విన్నవించారు.
దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ శ్మశాన వాటికలపై ఇప్పటికే ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుందని చెప్పారు. సచివాలయాల వారీగా ఎస్సీలకు శ్మశానవాటికలు లేనిచోట ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా క్రైస్తవ ప్రతినిధులు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలతో నిరుపేదలకు మేలు జరుగుతోందని కొనియాడారు. పారదర్శకంగా, వివక్షలేకుండా పథకాలు అందుతున్నాయన్నారు. డీబీటీ వల్ల చివరి లబ్ధి దారుడికి సైతం పథకాల మేలు లభిస్తోందని ప్రశంసించారు. పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చి సహాయకారిగా నిలిచారని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
చర్చి ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చర్చిల ఆధ్వర్యంలోని స్కూళ్లకూ, సేవా భవనాలకు మున్సిపల్ పన్నును మినహాయించాలని విన్నవించారు. జిల్లా కేంద్రాల్లో కమ్యూనిటీ హాళ్లను నిర్మించాలని సీఎంను కోరారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ల కోసం న్యాయపోరాటం చేస్తున్నామని.. దీనికి తోడుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment