సిద్ధమెన క్రికెట్ మైదానం
● రాయచోటిలో సర్వాంగ సుందరంగా క్రికెట్ స్టేడియం
● క్రీడాకారులకు అవసరమైన అన్ని వసతుల కల్పన
● నేడు క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించనున్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
సాక్షి రాయచోటి: కొత్త జిల్లా..కొత్త భవనాలు..నూతన క్రీడా మైదానంతో రాయచోటి మురిసిపోనుంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఆవిర్భవించిన అన్నమయ్య రూపురేఖలు మారుతోంది. ఒకవైపు ఆహ్లాదం, మరోవైపు వినోదానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. అందులో భాగంగానే క్రీడలను ప్రోత్సహిస్తూ ఆడుదాం పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో క్రికెట్ స్టేడియం ఉండాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ పీఎస్ గిరీషా, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డిలు అనుకున్నదే తడువుగా రాయచోటిలో స్టేడియం ఏర్పాటుకు కృషి చేశారు.
అన్నిరకాల క్రీడలకు కోర్టులు
రాయచోటిలో క్రీడాకారులకు అనువుగా మైదానాలను తయారు చేసేందుకు అధికారులు ముందుకు కదులుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని దిగువ అబ్బవరం ప్రాంతంలోని నక్కావాండ్లపల్లె వద్ద క్రికెట్ స్టేడియం, ఫుట్‌బాల్, ఫీల్డ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ బిల్డింగ్, అథ్లెటిక్ ట్రాక్, వాలీబాల్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్ కోర్టులు, స్విమ్మింగ్ ఫూల్, మల్టీపర్పస్ హాలు, కబడ్డీ తదితర ఆటలకు సంబంధించిన కోర్టులు, ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు సంబంధించి నిర్మాణాలకు ప్రతిపాదనలు రూపొందించారు. ఇప్పటికే సుమారు 30 ఎకరాల స్థలాన్ని కేటాయించి..అందుకు అనువుగా చదును చేశారు. ఆటలకు సంబంధించి కోర్టులు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు. నక్కావాండ్లపల్లె నుంచి క్రికెట్ స్టేడియం వరకు డబల్ రోడ్డు పనులు పూర్తి కావచ్చాయి.
అద్భుతంగా క్రికెట్ స్టేడియం
రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని నక్కావాండ్లపల్లె సమీపంలో సుమారు ఎనిమిది నెలలుగా కష్టపడి అఽఽధికారులు స్టేడియానికి రూపుతెచ్చారు. స్టేడియం నిర్మించే ప్రాంతంలో రాళ్లు తొలగించడం, జంగిల్ క్లియరెన్స్ చేయడమే కాకుండా మైదానాన్ని చదును చేశారు. స్టేడియం మొత్తం పచ్చదనం పెంపుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. స్టేడియంలోని నీరు బయటికి వెళ్లేందుకు డ్రైనేజీ సౌకర్యం కల్పించారు. అలాగే స్టేడియం చుట్టూ ప్రేక్షకుల కోసం గ్యాలరీల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. క్రికెట్ స్టేడియంలో రెండు క్రికెట్ పిచ్‌లను బెంగుళూరుకు చెందిన నిపుణుల ద్వారా ఏర్పాటు చేశారు. సుమారు రూ. 1.50 కోట్ల వ్యయంతో స్టేడియం నిర్మాణ పనులు పూర్తి చేశారు. వైఎస్సార్ పెవిలియన్ భవనం స్టేడియంలో క్రీడాకారులకు అనువుగా ఉండేలా రూపొందించారు. ఈ భవనంలో క్రీడాకారులు అటు, ఇటువైపు కూర్చొనేలా ఏర్పాట్లు చేయడంతోపాటు అక్కడనే వసతి, ఇతర సౌకర్యాలు కల్పించారు. పెవిలియన్ భవనంలో కూర్చొని మ్యాచ్‌లను తిలకించేలా వీఐపీలకు వసతి సౌకర్యాన్ని కల్పించారు.
నేడు ప్రారంభం
క్రికెట్‌కు సంబంధించి నక్కావాల్లపల్లె సమీపంలో అన్ని హంగులతో స్టేడియం సిద్ధమైంది. వైఎస్సార్ పెవిలియన్ భవనం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. క్రికెట్ అసోసియేషన్ నిపుణుల ద్వారా టర్ఫ్ వికెట్‌ను రూపొందించాం. క్రికెట్ స్టేడియాన్ని అద్భుంతంగా రూపుదిద్దాం. గురువారం ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి చేతుల మీదుగా స్టేడియం ప్రారంభించనున్నాం. – పీఎస్ గిరీషా,
కలెక్టర్, అన్నమయ్య జిల్లా
Comments
Please login to add a commentAdd a comment