లక్ష్యసాధనకు కృషి చేయాలి
అధికారులతో కలెక్టర్ సమీక్ష
పుల్లంపేట: పుల్లంపేటలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. మండలంలోని రెవెన్యూ అధికారులు, ఆర్ డబ్ల్యుఎస్, పంచాయతీరాజ్, హౌసింగ్, ఉపాధి హామీ, విద్యుత్, ఇరిగేషన్, వెటర్నరీ వైద్యులతో సమావేశం నిర్వహించారు. అధికారులందరూ కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. భూ సమస్యలు, హౌసింగ్ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం దేవసముద్రం గ్రామంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అరవిందకిషోర్, ఎంపీడీఓ జయశ్రీ, అధికారులు పాల్గొన్నారు.
రాయచోటి: ప్రభుత్వ ఆశయాలు, సిద్దాంతాల లక్ష్య సాధనలో అన్నిశాఖల అధికారులు బాధ్యతాయుతంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్‌లోని సమావేశ హాలులో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, పశు సంవర్థక, హార్టికల్చర్, సెరికల్చర్, మత్స్య, అటవీ, మైనింగ్, జలవనరులు, పరిశ్రమలు, ఏపీఐఐసీ, ఏపీఎస్‌పీడీసీఎల్, రోడ్లు అండ్ భవనాలు, హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్స్, పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య, ఉన్నత విద్య తదితర శాఖల లక్ష్యాలు, సాధించిన ప్రగతి, వందరోజుల ప్రణాళిక, విజన్ 2047 ప్రణాళికలో భాగంగా నిర్దేశించుకున్న ఆయా అంశాలలో తీసుకున్న, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. చేపట్టాల్సిన కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శన్ రాజేంద్రన్, సిపిఐ వెంకట పెద్దయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు
ఓబులవారిపల్లె: ప్రజల సమస్యలు సత్వరం పరిష్కరించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన సమస్యలు క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కారం చేయాలని సూచించారు. అపార్ ఐడీ కార్డులు ఆన్‌లైన్ చేయడంలో మండలం వెనుకబడి ఉందని, ఎందుకు నమోదు చేయలేదని అధికారులను ప్రశ్నించారు. వెంటనే విద్యార్థుల అపార్ ఐడీ కార్డులు ఆన్‌లైన్ త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులందరూ కృషి చేయాలన్నారు. హౌసింగ్ సంబంధించి చాలా వెనుకబడి ఉన్నారని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నోటీసులు జారీ చేస్తామన్నారు. రెవెన్యూ సమస్యలు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీధర్ రావు, ఎంపీడీఓ మల్ రెడ్డి, ఎంఈఓ రెడ్డయ్య, అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్
Comments
Please login to add a commentAdd a comment