పట్టు జారింది
మదనపల్లె సిటీ: పట్టు పరిశ్రమపై ఆధారపడిన రైతులు పట్టు కోల్పోతున్నారు. ప్రభుత్వం నుంచి తగిన సహకారం లేక.. ప్రోత్సాహకాలు అందక... ధరలు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియక... రైతులకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్ బకాయిలు అందకపోవడంతో సిరికల్చర్ వ్యవస్థ ఉనికే ప్రశ్నార్థకం అవుతోంది. మరోవైపు రీలర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో సిల్క్ పరిశ్రమ కళకళలాడుతోంది. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు, ప్రస్తుత సీఎం చంద్రబాబు జిల్లాను సెరికల్చర్ హబ్ చేస్తామన్న మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. ఫలితంగా జిల్లాలో మల్బరీ విస్తీర్ణం తగ్గుముఖం పడుతోంది.
– జిల్లాలో పట్టురైతులకు ప్రోత్సాహం అందక.. నాణ్యత లేని సిల్క్ తయారీతో ధరలు పడిపోతున్నాయి. దానికి తోడు ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రోత్సాహకాలు, పథకాలు సక్రమంగా అమలు కాక సెరికల్చర్‌పై ఆధారపడిన రైతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. జిల్లాలో 12,839 ఎకరాల్లో మల్బరీ సాగవుతోంది. ప్రస్తుతం మదనపల్లె డివిజన్ పరిధిలో 15 మండలాలలో 10 వేల ఎకరాలు సాగు అవుతుండగా ప్రస్తుతం 7 వేలకు పడిపోయింది. సుమారు 3 వేల మంది రైతులు మల్బరీ సాగు వదిలేశారు. అయితే టమటా సాగుపై రైతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.
ఇన్సెంటివ్ బకాయిలు రూ. కోటికిపైగానే...!
పట్టురైతులకు ప్రోత్సాహకంగా కిలో గూళ్లకు ప్రభుత్వం రూ.50 అందజేస్తోంది. ఇప్పటిదాకా మదనపల్లె డివిజన్ పరిధిలో రూ.కోటికిపైగానే ఇన్సెంటివ్ బకాయిలు రావాల్సి ఉంది. దీనిపై రైతులు పోరాడుతూనే ఉన్నారు.
సిరికల్చర్ హబ్ ఉత్తి మాటలే...!
జిల్లాను ప్రపంచ స్థాయి సెరికల్చర్ హబ్‌గా చేస్తానని గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం, ఆపై చంద్రబాబు మాటిచ్చారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో సెరికల్చర్ హబ్ చేస్తానని చెప్పారు. తరువాత పట్టించుకున్న పాపన పోలేదు.
అందని ప్రోత్సాహకాలు
గతంలో రైతులు మల్బరీ తోటను సాగు చేయడానికి ప్లాంటేషన్‌కు 75 శాతం రాయితీతో రూ.6750 అందేది. రేరింగ్ షెడ్డుకు యూనిట్ ధర రూ.3 లక్షలు అందించేవారు. చాకీ సెంటర్ నిర్వాహకులకు రాయితీ వచ్చేది. ప్లాస్టిక్ నేత్రికలను సైతం రైతులకు పంపిణీ చేసేవారు. సిల్క్ ఇండస్ట్రియల్‌కు సంబంధించి 50 శాతం సబ్బిడీ రీలింగ్ యూనిట్లకు అందించేవారు. కానీ ఇవన్నీ గతం. ఇప్పుడు ఈ పథకాలు ఉన్నప్పటికీ అమలు కష్టమైంది.
కొండెక్కిన పట్టుపరిశ్రమశాఖప్రోత్సాహకాలు
ఇన్సెంటివ్ బకాయిలు రూ.కోటికిపైగానే
ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువు
సెరికల్చర్ హబ్ చేస్తామని గతంలో కిరణ్ సర్కారు, ప్రస్తుత సీఎం చంద్రబాబు హామీలు
అవగాహన సదస్సులు
రైతులు మల్బరీ సాగు చేసేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మల్బరీ సాగు వల్ల కలిగే లాభాలు, ప్రోత్సాహకాలు గురించి తెలియజేస్తున్నాం. ఇప్పటికే రామసముద్రం, తంబళ్లపల్లె మండలాల్లో రైతులకు అవగాహన కల్పించాం. మార్కెట్‌కు పట్టుగూళ్లు తెచ్చే విధంగా చర్యలు చేపట్టాం. ఇన్సెంటివ్ త్వరలో అందుతుంది.
– రామమోహన్, ఏడీ, సిరికల్చర్, మదనపల్లె
Comments
Please login to add a commentAdd a comment