వైఎస్ జగన్‌ను కలిసిన కొరముట్ల
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తనను నియమించినందుకు రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంగళవారం కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిలో ఆయనను కలిసిన కొరముట్ల పుష్పగుచ్ఛం అందించి తనకు ఇచ్చిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని తెలిపారు.
జాతీయ కబడ్డీ పోటీలకు నాగిరెడ్డిపల్లి విద్యార్థి
నందలూరు: మండలంలోని నాగిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎనిమిదవ తరగతి విద్యార్థి సయ్యద్ ఉమర్ ఉస్మాన్ అలీ కబడ్డీ పోటీలలో జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. సోమవారం బాపట్లలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో సయ్యద్ ఉమర్ ప్రతిభ చాటి జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. మంగళవారం ఆ విద్యార్థిని పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలు గౌరీ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయలలిత కుమారి, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.
ఆసుపత్రులు నిబంధనలు పాటించాల్సిందే
రాయచోటి అర్బన్: జిల్లాలోని అన్ని ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలను పాటించాల్సిందేనని డీఎం అండ్‌హెచ్‌ఓ డాక్టర్ కొండయ్య అన్నారు. మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో ఏవైనా యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రులు, క్లినిక్‌లు ఏర్పాటు చేసే స్థలాల పత్రాలను, మున్సిపాలిటీ నుంచి ట్రేడ్ లైసెన్స్, బిల్డింగ్‌ప్లాన్ తదితరాలు పీడీఎఫ్ రూపంలో జతపరచాలన్నారు. రెన్యువల్ గడువు ముగిసే రెండు నెలల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పదిలో ఉత్తమ ఫలితాలకు కృషి
లక్కిరెడ్డిపల్లి: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు హెచ్‌డబ్ల్యుఓలు కృషి చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధి కారి జయప్రకాష్ పేర్కొన్నారు. మంగళవారం ఎస్సీ బాలుర హాస్టల్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం ఇవ్వాలన్నారు. ఎస్సీ–వన్, టు వసతి గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వీటిని త్వరలో అద్దెభవనంలోకి మారుస్తామన్నారు. విద్యార్థులకోసం ప్రత్యేక ట్యూటర్లు ఏర్పాటు చేశామని, ప్రత్యేక తరగతులు నిర్వహించి మెరుగైన ఫలితాల కోసం కృషి చేయాలన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. జిల్లాలో నాడు–నేడు కింద 24 వసతి గృహాలు మంజూరయ్యాయని, నిధులు లేక ఆగిపోయాయని ఆయన అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం నిధులు ఇస్తే వసతి గృహాలకు మరమ్మతులు చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌డబ్ల్యుఓలు రమేష్ బాబు, శ్రీనివాసులు, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment