చలి కాలం.. జరభద్రం
చలి.. తన పంజా విసురుతోంది. వేకువజాము మొదలు దట్టమైన పొగమంచు కమ్ముతోంది. స్వెటర్లు వేసుకున్నా.. మంకీ క్యాపు
పెట్టుకున్నా.. మఫ్లర్లు కట్టుకున్నా..
గజగజ వణకాల్సిందే. అన్నమయ్య జిల్లాలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18.1 డిగ్రీలకు చేరింది.
ఈ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు
వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, పనులకు వెళ్లే
జనంతోపాటు వృద్ధులు, చిన్నారులు
జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
రాజంపేట టౌన్ : చలికాలం వచ్చేసింది. వాతావరణంలో సంభవించిన పెను మార్పుల కారణంగా పగటి ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా 18.1 డిగ్రీలు కాగా, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల సెల్సియస్ దాటడం లేదు. రాజంపేట పట్టణంతోపాటు, జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిత్యం మంచు కురుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అనేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పని సరి
చల్లని గాలులు వీస్తుండడంతో ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసి ఉంటుంది. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం వెళ్లే ప్రజలు, కూలీలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయాన్నే వాకింగ్, జాగింగ్ చేసే వారు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోకుంటే జబ్బుల బారిన పడాల్సి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆస్మా జబ్బు ఉన్న వారు శీతాకాలంలో వాకింగ్‌కు వెళ్లకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. చలితీవ్రత పెరిగే కొద్ది శ్వాస కోస వ్యాధులు ప్రబలే ప్రమాదన్నందున ఉదయాన్నే బయటకు వెళ్లకపోవడమే ఉత్తమమని, వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి.
పరిసరాల పరిశుభ్రత ముఖ్యం
వ్యక్తిగత పరిశుభ్రత ఎంత ముఖ్యమో, పరిసరాల పరిశుభ్రత అంతే ముఖ్యం. దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. దోమ కుడితే టైఫాయిడ్, డెంగీ, చికెన్ గన్యా, మెదడువాపు, విష జ్వరాలు వచ్చే అవకాశాలుంటాయి. తాగునీటి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని తాగడం శ్రేయస్కరమని, వేడి వేడి ఆహార పదార్దాలనే తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వంట పాత్రలపై విధిగా మూతలు పెట్టాలని, దోమ తెరలు వాడాలని హెచ్చరిస్తున్నారు.
ఉన్ని దుస్తులకు ధరించాలి
చలి పెరగడంతో శీతాకాలం దుస్తులు విక్రయించే దుకాణాలు ఏర్పాటు చేస్తారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడేవారు, జ్వరం, దగ్గు సమస్యలున్నవారు వెచ్చని వాతావరణంలో ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వృద్ధులు, చిన్నారుతోపాటు అన్ని వయస్కుల వారు.. తమకు అనుగుణంగా స్వెటర్లు, జర్కిన్, మంకీ టోపీలు ధరించడం మేలు. శీతలపానీయాలకు, ఐస్‌క్రీంలకు దూరంగా ఉంటూ.. బయటికి వెళ్లినపుడు చెవుల్లోకి దూది పెట్టుకుని వెళ్లడం మంచిదని చెబుతున్నారు.
జిల్లాలో 18.1 ఉష్ణోగ్రతల నమోదు
ఆరోగ్య జాగ్రత్తలు అవసరమంటున్న వైద్యులు
పరిశుభ్రత పాటిస్తే జ్వరాలు దూరం
జాగ్రత్తలు పాటించకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవు
చలి కాలంలో ప్రతి ఒక్కరూ విధిగా తగు జాగ్రత్తలు పాటించాలి. శీతాకాలంలో ముఖ్యంగా జలుబు, జ్వరం, ఫ్లూ వంటివి వ్యాపించే ప్రమాదముంది. జాగ్రత్తలు పాటించకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవు. అందువల్ల ప్రతి ఒక్కరు శీతాకాలం ముగిసే వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
– డాక్టర్ పీవీ.నాగ్వేశ్వరరాజు, సూపరిండెంట్, ప్రభుత్వ ఆసుపత్రి, రాజంపేట
Comments
Please login to add a commentAdd a comment