అన్నప్రాసన రోజే అనంతలోకాలకు..
మదనపల్లె : ఆరు నెలలు నిండకుండానే ఆ చిన్నారికి నూరేళ్లు నిండాయి. గుర్రంకొండ మండలం మర్రిమాకులపల్లెకు చెందిన బాలాజీ, భారతిలకు ఒకటిన్నర సంవత్సరం క్రితం వివాహమైంది. వీరికి ఐదునెలల క్రితం మొదటి కాన్పులో మగశిశువు జన్మించాడు. ఆరోనెలలో పడిన వెంటనే చిన్నారికి అన్నప్రాసన కార్యక్రమం స్థానికంగా ఉన్న ఓ ఆలయంలో ఘనంగా చేసేందుకు నిర్ణయించి ఆదివారం బంధుమిత్రులను ఆహ్వానించారు. కార్యక్రమం అనంతరం చిన్నారిని తీసుకుని ఇంటికి వస్తుండగా ఉన్నట్లుండి అస్వస్థతకు లోనయ్యాడు. వెంటనే తల్లిదండ్రులు చిన్నారిని వాల్మీకిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి మదనపల్లెకు రెఫర్ చేశారు. హుటాహుటిన చిన్నారిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. అత్యవసర విభాగ వైద్యులు పరీక్షించి, అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఆరునెలలు నిండకుండానే అనంతలోకాలకు చేరుకున్నవా.. చిట్టి తండ్రీ అంటూ చిన్నారిని చేతుల్లోకి తీసుకుని ఆర్తనాదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment