5న వైఎస్సార్‌సీపీ ఫీజు పోరు
రాయచోటి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఫిబ్రవరి 5వ తేదీ ఫీజు పోరు కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాయచోటిలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డితో కలిసి ఫీజు పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 8 నెలల పాలనలో ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమం కూడా చేయలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. రైతు సమస్యలు, పెంచిన విద్యుత్ ఛార్జీలపై వైఎస్సార్‌సీపీ ఇప్పటికే ఆందోళనలు చేసిందన్నారు. ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలని నాడు దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రవేశపెట్టారన్నారు. దీంతో ఎందరో ఐటీ నిపుణులుగా, ప్రొఫెషనల్ కోర్స్‌లతో తమ జీవితాలను మెరుగుపరచుకున్నారని తెలిపారు. నేడు చంద్రబాబు పేద, మధ్య తరగతి విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పక్షాన ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను చేపడుతున్నామని అమరనాథరెడ్డి చెప్పారు. సమావేశంలో రాయచోటి మున్సిపల్ చైర్మన్ ఫయాజ్‌బాషా, స్థానిక కౌన్సిలర్లు, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
పోస్టర్లు విడుదల చేసిన నేతలు
Comments
Please login to add a commentAdd a comment