విజయం సాధించు
ఒత్తిడిని జయించు..
● కిరణ్ మదనపల్లె పట్టణంలోని వివేకానంద మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. రాత్రి 11 వరకు పుస్తకాలతో కుస్తీపడతాడు. ఉదయం పాఠశాలకు వెళ్లినప్పుడు టీచర్ ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్పలేకపోతున్నాడు. రాత్రి చదివిందంతా ఉదయానికి గుర్తు చేసుకోలేకపోతున్నాడు.
● వాల్మీకిపురానికి చెందిన తరుణ్ ఓ ప్రైవే టు పాఠశాలలో పది చదువుతున్నాడు. గతంలో బాగా మొబైల్ ఫోన్లో ఆటలాడటం, సిని మాలు చూడటం వంటివి చేసేవాడు. పరీక్షలు దగ్గరపడటంతో ఉపాధ్యాయులు సెల్‌ఫోన్లు వాడకాన్ని కట్టడి చేశారు. దీన్ని తట్టుకోలేక ఫోన్ ఇవ్వపోతే పాఠశాలకు వెళ్లనని మొండికి వేశాడు. దీంతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
● మదనపల్లెకు చెందిన రమ్య ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. పరీక్షల్లో మార్కులను ప్రామాణికంగా తీసుకుని బాగా చదువుతోంది. తొలుత ఎఫ్–1 సెక్షన్‌కు ప్రమోట్ చేశారు. ఆ సెక్షన్‌లోని సహచర పిల్లలతో పరిచయాలు పెంచుకుని నిత్యం హుషారుగా కాలేజీకి వెళుతోంది. 10 రోజుల క్రితం మళ్లీ సెక్షన్లు మార్చారు. అంతగా చదవడం లేదని ఈసారి ఆ బాలికను ఎఫ్–3 సెక్షన్‌కు డిమోట్ చేశారు. దీనిని అవమానంగా (ఇన్సల్ట్) భావించి సదురు విద్యార్థిని అన్నం తినకపోవడం, సరిగా నిద్రపోకపోవడం వంటివి చేస్తోందని గుర్తించి తల్లిదండ్రులు సైకాలజిస్టును సంప్రదించారు.
ఇలాంటి ఉదంతాలు ప్రస్తుతం జిల్లాలో నిత్యం చోటు చేసుకుంటున్నాయి..
మదనపల్లె సిటీ: పది, ఇంటర్ విద్యార్థులు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. పలువురు సైక్రియాటిస్టులను సంప్రదిస్తున్నారు. పది పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుంచి మార్చి 31 వరకు జరగనున్నాయి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మార్చి 1 నుంచి,ద్వితీయ సంవత్సరం మార్చి 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలలు, కాలేజీల్లో ర్యాంకులు,మంచి మార్కులు సాధించాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో విద్యార్థులు డిప్రెషన్‌కు లోనవుతున్నారు. ఈ క్రమంలో వారు నేర్చుకున్న పాఠాలు మరచిపోతున్నారు. మరి కొందరు అన్నం సరిగా తినడం లేదు. మరికొందరు పాస్ అవుతామా లేదే అనే ఆందోళనకు గురవుతున్నారు. పరీక్షలను ఎలా ఎదుర్కోవాలో తెలియక మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నారు. మరో వైపు కొందరు తల్లిదండ్రులు మంచి మార్కులు సాధించాలని ఒత్తిడి పెంచడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒత్తిడిని జయించాలని, ప్రణాళకతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఒత్తిడి తగ్గించే ప్రణాళిక
పదో తరగతి విద్యార్థులకు పరీక్షల్లో ఒత్తిడి తగ్గించేలా ప్రణాళికలు చేశాం. టైం టేబుల్ ప్రకారం చదివిస్తున్నాం. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి అవసరమైన మేరకు చదివిస్తున్నాం. పిల్లల విషయంలో తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. –ప్రభాకర్‌రెడ్డి, ఎంఈఓ,మదనపల్లె
కేసులు పెరిగాయి
టెన్త్, ఇంటర్ చదివే విద్యార్థులు అనేక మంది కౌన్సెలింగ్ కేంద్రానికి వస్తున్నారు. వారితో మాట్లాడితే దడ, వణుకు వస్తుందని, ఛాతీలో నొప్పి ఉంటోందని, నోరు ఎండిపోతుందని చెబుతున్నారు. పరీక్షలు రాయలేమని, ఏం చదివినా గుర్తుండటం లేదని.. ఇలా అనేక కారణాలు చెబుతున్నారు. సమస్యలు విని బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వాటిని అధిగమించడానికి కూర్చోబెట్టి కౌన్సెలింగ్ చేస్తున్నాం. –చాముండేశ్వరి, సైక్రియాటిస్టు, మదనపల్లె
పదోతరగతి పరీక్షకు హాజరయ్యే
విద్యార్థులు: 21,468 మంది
పరీక్షలు జరిగే తేదీలు: మార్చి 17 నుంచి 31 వరకు
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం: 15,356 మంది
ద్వితీయ సంవత్సరం: 14,248 మంది
పరీక్షలు ప్రారంభమయ్యే తేదీ: ప్రథమ సంవత్సరం: మార్చి 1 నుంచి
ద్వితీయ సంవత్సరం: మార్చి 3 నుంచి
విద్యార్థులు ప్రణాళికతో చదవాలి
నిపుణుల సూచనలు
Comments
Please login to add a commentAdd a comment