●నీరుగారుతున్న వ్యవస్థ...
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్పార్ జిల్లాలో పేకాట క్లబ్బు గబ్బు జోరుగా సాగుతోంది. పులివెందుల మొదలు జమ్మలమడుగు.. ప్రొద్దుటూరు ఇలా నలు దిక్కులా విస్తరిస్తోంది. అక్రమ ఆదాయమే లక్ష్యంగా కూటమి నేతలు బరితెగిస్తున్నారు. మూడు భూ ఆక్రమణలు.. ఆరు పేకాట క్లబ్లులతో చెలరేగిపోతున్నారు. అనధికార క్లబ్బుల విషయంలో సాక్షాత్తు కూటమి ఎంపీ ఫిర్యాదు చేయడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా అనధికార క్లబ్‌లు యథేచ్ఛగా సాగుతున్నా.. వీటి దెబ్బకు కుటుంబాలు గుళ్లవుతున్నా... జిల్లా యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. నిఘా వర్గాలు నివేదించినా కిమ్మనడం లేదు. అనధికార పేకాట క్లబ్బులు జమ్మలమడుగు, పులివెందుల సబ్ డివిజన్లలో మరింత అధికంగా ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేశారని వందలాది మందిని గుర్తించి నోటీసులు జారీ చేసినా పోలీసులకు అనధికార పేకాట క్లబ్‌లు నిర్వహణ పట్టకపోవడం గమనార్హం.
● ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టగానే కూటమి నేతలు దందాలు, దౌర్జన్యాలకు బరి తెగించారు. మరోవైపు ప్రభుత్వ భూములతో పాటు సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం ఉల్లంఘిస్తూ చెరువు, వంక పోరంబోకు భూములను సైతం ఆక్రమిస్తున్నారు. ఇలాంటి చర్యలకు జిల్లాలో రెవెన్యూ, పోలీసుశాఖల అండదండలు ఉండడంతో మరింతగా రెచ్చిపోయి స్వాహా పర్వాన్ని అందుకున్నారు. కట్టడి చేయాల్సిన కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అటు దిశగా సమీక్ష కూడా చేపట్టలేదనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు పోలీసు వ్యవస్థను చెప్పు చేతల్లో పెట్టుకొని విచ్చలవిడి దౌర్జన్యాలకు దిగుతూ, అక్రమ ఆదాయం కోసం అడ్డదారులు ఎంచుకున్నారు. ఈక్రమంలో నిజాయితీ పరుడిగా ముద్రపడ్డ ఎస్పీ హర్షవర్థన్‌రాజుకు అర్ధాంతర బదిలీ బహుమానంగా ఇచ్చారు. తాజాగా ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ బాధ్యతలు చేపట్టినా కిందిస్థాయి సిబ్బంది ఆశించిన మేరకు సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలు లేకపోలేదు.
పులివెందులలో మొదలు...
అనధికార పేకాట క్లబ్‌ల నిర్వహణ తొలుత పులివెందుల సబ్ డివిజన్‌లో మొదలైంది. త్రిబుల్ స్టార్ అధికారుల చొరవ, ప్రోత్సాహం, అధికార పార్టీ నేతల అండదండలతో తెలుగుతమ్ముళ్లు యథేచ్ఛగా కొనసాగించారు. ఇటీవల ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవీంద్రనాథరెడ్డిల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా తాత్కాలికంగా తెరపడినట్లు తెలుస్తోంది. ఈజాడ్యం జమ్మలమడుగు సబ్ డివిజన్, అటునుంచి ప్రొద్దుటూరు సబ్ డివిజన్ దాకా విస్తరించింది. పేకాట క్లబ్‌ల్లో సైతం రూ. లక్షల్లో జూదం అడుతున్నారు. జమ్మలమడుగులో పేకాట క్లబ్ దేవగుడికి చెందిన నాగేశ్వరరెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్నట్లు స్వయంగా ఎంపీ సీఎం రమేష్‌నాయుడు కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. అంటే ఏస్థాయిలో పేకాట నిర్వహిస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అనకాపల్లె ఎంపీ గుర్తించేంతవరకూ జిల్లా యంత్రాంగానికి తెలియదనుకోవాలా? తెలిసినా కూటమి ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండడంతోనే మిన్నకుండి పోయారా? ఇలాంటి ప్రశ్నలకు జిల్లా అధికార యంత్రాంగం వద్ద జవాబు కొరవడింది.
వైఎస్సార్ జిల్లాలో అనధికార పేకాట క్లబ్‌లు ఏర్పాటు
అక్రమ ఆదాయం కోసం అడ్డదారులు ఎంచుకున్న కూటమి నేతలు
స్వయానా బీజేపీ ఎంపీ రమేష్‌నాయుడు ఫిర్యాదు
అనకాపల్లి ఎంపీ గుర్తించినాకళ్లు తెరవని జిల్లా యంత్రాంగం
కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలు సర్వనాశనం అవుతున్నాయనేదానికి చాలా ఉదాహరణలు చెప్పుకొవచ్చు. వేముల మండలంలో టిఫిన్ కంపెనీకి చెందిన కోట్లాది రూపాయల విలువైన 2వేల పైబడి టన్నుల బైరెటీస్ రాత్రికి రాత్రి లూఠీ చేశారు. సంక్రాంతి పండుగ రోజు భారీ టిప్పర్లతో తెల్లారేలోపు తరలించకుపోయారు.దీనిపై టిఫెన్ కంపెనీ కేర్ టేకర్ రామలింగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బైరెటీస్ ఖనిజం ఫలానా చోటికి తరలించారని స్పష్టంగా వివరించినా, అందుకు బాధ్యులు పేర్ల పార్థసారధిరెడ్డి, పేర్ల శేషారెడ్డి, మబ్బుచింతలపల్లె శ్రీనాథరెడ్డిలంటూ ఫిర్యాదు చేసినా కనీసం ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. ఇప్పటికీ ఫిర్యాదుదారుడికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అధికారపార్టీ నేతల సిఫార్సులు లేకపోతే, కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నోచుకోవడం లేదంటే పోలీస్ వ్యవస్థ ఎలా ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక అనధికార పేకాట క్లబ్‌లు కట్టడి చేయడానికే దమ్ము, ధైర్యం లేని దుస్థితిలో జిల్లా పోలీసుశాఖ ఉంటోందని పలువురు వాపోతున్నారు. జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి ఎలా ఉన్నా, కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడి పేకాట నిర్వహణ సాధ్యమైందని విశ్లేషకులు దెప్పి పొడుస్తుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment