చదువుల తల్లిగా బాలచాముండేశ్వరీదేవి | - | Sakshi
Sakshi News home page

చదువుల తల్లిగా బాలచాముండేశ్వరీదేవి

Published Thu, Oct 10 2024 2:46 AM | Last Updated on Thu, Oct 10 2024 2:46 AM

చదువు

అమరావతి: శ్రీదేవీ శరన్నవరాత్ర మహోత్సవాలలో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి శ్రీ బాలచాముండిక సమేత అమరేశ్వరాలయంలో మూలా నక్షత్రం సందర్భంగా బుధవారం అమ్మవారు చదువుల తల్లి సరస్వతీ దేవిగా భక్తుల పూజలందుకున్నారు. అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, దేవీ ఖడ్గమాల, త్రిశల, లలితా సహస్ర నామార్చన, శ్రీ చక్రార్చన పూజలు నిర్వహించారు. ఆలయంలోని జ్వాలాముఖి, మహిషాసురమర్దిని అమ్మవార్లకు కూడా ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో, సీతాసమేత శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో అమ్మవారికి సరస్వతీ దేవి అలంకారం సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలను సందర్శించి పూజలు నిర్వహించారు.

15లోగా సహకార సంఘాల కంప్యూటరీకరణ

పల్నాడు జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబు

నరసరావుపేట: జిల్లాలోని సహకార సంఘాల కంప్యూటరీకరణ అక్టోబరు 15లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మూడవ జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. కారుమంచి, బొల్లాపల్లి సహకార సంఘాలకు మంజూరైన పెట్రోలు బంకులు వెంటనే ప్రారంభించేలా చూడాలని సూచించారు. నాదెండ్ల సహకార సంఘం నిర్వహిస్తున్న ప్రధాన మంత్రి జన ఔషధీ కేంద్రాల్లో తక్కువ ధరకు ఔషధాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించి, అమ్మకాలు పెంచాలని తెలిపారు. ఈపూరు, నరుకుళ్లపాడు, శాల్యాపురం, కారుమంచి జనఔషధీ కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించారు. రానున్న ఐదేళ్లలో సహకార సంఘాల నేతృత్వంలోని శీతల గిడ్డంగుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. ఇప్పటికే నిర్వహిస్తున్న బహుళ ప్రయోజన గిడ్డంగులను అద్దెకు ఇచ్చే విషయంలో ప్రభుత్వ సంస్థలకు ప్రాధాన్యతనివ్వాలని చెప్పారు. జిల్లా సహకార అధికారి ఎం.వెంకటరమణ, జీడీసీసీ బ్యాంకు జీఎం అజయ్‌కిషోర్‌, నాబార్డ్‌ డీడీఎం శరత్‌, జిల్లా మత్స్య అధికారి సంజీవరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కాంతారావు, పంచాయతీ రాజ్‌ శాఖ ఏవో జయకృష్ణ, సహకార అధికారులు శ్రీనివాసరావు, నాగశ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మధుశాలినికి అభినందనలు

నరసరావుపేట ఈస్ట్‌: ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ అండర్‌–19 బాలికల రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పట్టణానికి చెందిన కుంచాల మధుశాలినికి బుధవారం ఏసీఏ మాజీ క్రీడాకారుడు ఆర్‌.దుర్గాప్రసాదు క్రికెట్‌ బ్యాట్‌ను బహూకరించారు. మహిళా క్రికెట్‌లో మధుశాలిని నిరంతర కృషితో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏసీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ మాజీ సభ్యుడు కె.వి.పురుషోత్తమరావు, రౌతు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

కృష్ణా నదిలో బాలుడి గల్లంతు

అమరావతి: మండల పరిధిలోని మల్లాది వద్ద కృష్ణా నదిలో బాలుడు నీటమునిగి గల్లంతైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.పోలీసులు సమాచారం ప్రకారం.. మండల పరిదిలోని మల్లాది ఎస్సీ కాలనీకి చెందిన నండూరు సామియేలురాజు(16) బుధవారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి కృష్ణానదిలో ఈత కొట్టటానికి వచ్చాడు. ఈ సమయంలో నదిలో మునిగి గల్లంతయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించి, నదిలో సామియేలురాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ లభించలేదు. ప్రస్తుతం పోలీసులు, గజ ఈతగాళ్లు గాలిస్తూనే ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
చదువుల తల్లిగా బాలచాముండేశ్వరీదేవి 
1
1/2

చదువుల తల్లిగా బాలచాముండేశ్వరీదేవి

చదువుల తల్లిగా బాలచాముండేశ్వరీదేవి 
2
2/2

చదువుల తల్లిగా బాలచాముండేశ్వరీదేవి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement