ఘనంగా ‘ పల్లె పండుగ’ వారోత్సవాలు
బాపట్ల: ‘ పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు ‘ జిల్లాలో జయప్రదంగా నిర్వహించాలని కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. పంచాయితీ వారోత్సవాలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలన్నింటిని పండుగ వాతావరణంలో ప్రారంభించాలని చెప్పారు. ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. గ్రామాలలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డులను విధిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పంచాయతీలలో చేపట్టే పనులకు అధికారికంగా ఆమోదం లభించిందని, భూమి పూజ చేసే కార్యక్రమాల ఫొటోలను తప్పనిసరిగా పోర్టల్‌లో నిక్షిప్తం చేయాలని సూచించారు. గ్రౌండింగ్ చేసిన పనులన్నీ జియోట్యాగ్ చేయాలని తెలిపారు. ఉపాధి హామీ పథకం నిధుల అనుసంధానంతో చేపట్టే పనులు గ్రామాలకు స్థిరాస్తిగా నిలిచిపోతాయని జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. పంచాయతీశాఖ ద్వారా రూ.76.66 కోట్లతో 670 పనులు చేస్తున్నారని చెప్పారు. వాటికి అధికారికంగా అనుమతులు లభించడంతో ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేశామని పేర్కొన్నారు. పంచాయతీలోని సాధారణ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా వస్తాయని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద మరో 564 పనుల్ని రూ.11.91 కోట్లతో చేపడుతున్నామని వెల్లడించారు. తాజాగా మరో 130 పనులకు అధికారికంగా ఆమోదం తెలిపినట్లు వివరించారు. చేపడుతున్న అభివృద్ధి పనులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆయన అధికారులకు సూచించారు. సమావేశంలో డీపీఓ ప్రభాకర్, డ్వామా పీడీ విజయలక్ష్మి, పీఆర్ ఎస్‌ఈ హరే రామకృష్ణ, డీఎల్‌డీవో సువార్త, మండలాల నుంచి ఎంపీడీవోలు పాల్గొన్నారు.
జువ్వలపాలెం, గాజర్లంక నుంచి ఇసుక తవ్వకాలు
బాపట్ల: ఉచిత ఇసుక విధానంలో జిల్లాలో రెండు రేవుల నుంచి తవ్వకానికి కలెక్టర్ జె. వెంకట మురళి అధికారికంగా ఆమోదం తెలిపారు. ఉచిత ఇసుక విధానంపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో నిర్వహించారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతాలైన కొల్లూరు మండలంలోని జువ్వలపాలెం, గాజుర్లంక గ్రామాలలో ఇసుక లభ్యత ఉన్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఒక్కొక్క రేవు వద్ద 74 వేల టన్నులకు పైగా ఇసుక లభ్యత ఉన్నట్లు తెలిపారు. జీవో ఎంఎస్ నంబర్ 40 ఆధారంగా రేవుల నుంచి ఇసుక తవ్వడానికి ఏజెన్సీలను ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. ఏజెన్సీ ఎంపిక ప్రక్రియ టెండర్ దశలో ఉందని, గురువారం సాయంత్రం దరఖాస్తులు గడువు ముగుస్తుందని తెలిపారు. ఇసుక రేవుల వద్ద అక్రమ తవ్వకాలు నియంత్రించాలని అధికారుల్ని ఆదేశించారు. అక్రమ తవ్వకాలు, రవాణా అరికట్టడానికి ఇద్దరు ఉప తహసీల్దార్లు, ముగ్గురు ఆర్‌ఐలు, పోలీసులను కలిసి కమిటీగా నియమించామని కలెక్టర్ తెలిపారు. నిరంతరం నిఘా, పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, తొమ్మిది చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ఉండాలని ఆదేశించారు. ఇసుక కొనుగోలుపై రూపొందించిన ప్రత్యేక యాప్‌పై సచివాలయాల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, ఉచిత ఇసుక విధానంపై ప్రజలకు సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, మైన్‌న్స్ ఏడీ రాజేష్, అనుబంధ శాఖల అధికారులు, ఆర్‌డీఓ పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
Comments
Please login to add a commentAdd a comment