సాగు ఆదాయం మరింత పెరగాలి
బాపట్ల: జిల్లాలో పంటల విస్తీర్ణం, దిగుబడులు పెంచి సాగు ఆదాయం మరింత వృద్ధి చెందేలా చూడాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్షించిన అంశాల పురోగతిపై వివిధ శాఖల జిల్లా అధికారులతో ఆయన మంగళవారం కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. రైతులకు అవగాహన కల్పించి ప్రకృతి వ్యవసాయాన్ని మరింత పెంచాలని ఆయన చెప్పారు. ప్రోటీన్ రైస్ , చిరుధాన్యాలు, పండ్ల ఉత్పత్తి, సూక్ష్మసేద్యం పెంచేలా చూడాలన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లభించేలా ఆన్‌లైన్ మార్కెటింగ్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. ధాన్యం సేకరణలో ఇతరుల జోక్యం ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. పశు సంపద పేంచేలా సంబంధిత వైద్యులు కృషి చేయాలన్నారు. కల్తీ పాల విక్రయాలను అరికట్టాలని సూచించారు. సముద్ర తీరం వెంబడి పెరిగే మొక్కలను ఉపాధి హామీ పథకంతో అనుసంధానం ద్వారా నాటడాన్ని పదిహేను రోజుల్లో పూర్తి చేయాలని చెప్పారు. ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో సౌర విద్యుత్ వినియోగించాలని, విరివిగా సోలార్ యూనిట్లను మంజూరు చేయాలని పేర్కొన్నారు. గుంతల రహిత రహదారుల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.17.32 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యాశాఖ, సర్వ శిక్ష అభియాన్ ఆధ్వర్యంలోని బడులు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పారు. వసతి గృహాలకు మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. వీటిని సచివాలయాలకు అనుసంధానిస్తామని చెప్పారు. ప్రభుత్వ వైద్యశాలల్లో సేవలు మెరుగు పరచాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పలు సూచనలు చేశారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌సీడీ ప్రోగ్రాం జాగ్రత్తగా నిర్వహించాలి
క్యాన్సర్ నివారణపై రూపొందించిన ప్రచార గోడ పత్రాలను కలెక్టర్ విడుదల చేశారు. ఎన్‌సీడీ ప్రోగ్రాం అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ నుంచి చేపట్టిన ఎన్‌సీడీ ప్రోగ్రాం కింద ప్రతి కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన వారికి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. వివరాలు యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ ప్రఖర్ జైన్, డీఎంహెచ్‌ఓ డాక్టరు ఎస్.విజయమ్మ, డాక్టరు శేషుకుమార్, డాక్టరు టి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
Comments
Please login to add a commentAdd a comment