ఇద్దర్ని బలిగొన్న కంటైనర్
బాపట్ల టౌన్: ఎమ్మెల్యేకు చెందిన కంపెనీ కంటైనర్.. రెండు నిండు ప్రాణాలను బలిగొంది. ఆగి ఉన్న ఆటోను కంటైనర్ ఢీకొట్టిన ఘటన కర్లపాలెం మండలం, బుద్దాం గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా... మరో 9 మందికి గాయాలయ్యాయి. కర్లపాలెం మండల కేంద్రానికి చెందిన బాలిగా హరీష్ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం కర్లపాలెం నుంచి చెరుకుపల్లి వైపు వెళ్తున్నాడు. బుద్దాం సమీపంలో ప్రయాణికురాలి నుంచి డబ్బులు తీసుకునేందుకు ఆటోను రోడ్డు మార్జిన్‌లో నిలిపాడు. అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ రొయ్యల కంపెనీ (రాయల్ మైరెన్)కు చెందిన కంటైనర్ చందోలు నుంచి కర్లపాలెం వైపు వస్తోంది. బుద్దాం సమీపంలోకి రాగానే డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా కంటైనర్ యూటర్న్ తీసుకొని ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ హరీష్ (27) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ఉన్న హరీష్ మిత్రుడైన దేవరకొండ వెంకటేశ్వర్లు (35), ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు అప్రమత్తమై వారిని చికిత్స నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఘటనా స్థలంలో తీవ్ర గాయాలపాలైన వెంకటేశ్వర్లును కూడా చికిత్స నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. అప్పటికే క్షతగాత్రుడికి రెండు కాళ్లు, పక్కటెముకలు విరిగాయి. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు తరలించారు. గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లేలోగానే మృతి చెందాడు. హరీష్, వెంకటేశ్వర్లు స్నేహితులు. వీరి భార్యలు భావన, జయశ్రీలు బంధువులే. వెంకటేశ్వర్లు లారీ డ్రైవర్. బాడుగ లేని సమయంలో ఇద్దరు కలిసి ఆటో నడుపుతుంటారు. ఆటో ఎక్కిన ప్రయాణికులు అనూహ్యంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. వారిలో మద్దిబోయిన శ్రీనివాసరావు (బుద్దాం), బి. సురేష్ (కర్లపాలెం), బెజ్జం ఇందిర (ఖాజీపాలెం), రెడ్డిపాలెం సమీపంలోని చాయిస్ రొయ్యల కంపెనీలో విధులు నిర్వర్తించే మెనకా మజార్, ఆకాష్, ప్రశాంత్ కౌర్, నిస్సీ, ఉమామాలీ, రోబిన్ కుమారి ఉన్నారు. వీరికి తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులతోపాటు క్షతగాత్రుల సంబంధికుల రోదనలు మిన్నంటాయి. రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న కర్లపాలెం తహసీల్దారు సుందరమ్మ వైద్యశాలకు చేరుకున్నారు. మృతుల కుటుంబసభ్యులతో మాట్లాడారు. క్షతగాత్రులను పరామర్శించారు. ఎస్‌ఐ ఎ.రవీంద్ర ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పత్తాలేని ప్రభుత్వ అంబులెన్స్
రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వెంకటేశ్వర్లుకు సకాలంలో వైద్యసేవలు అందలేదు. పాలకుల నిర్లక్ష్యం...అధికారుల అలసత్వం కారణంగానే వెంకటేశ్వర్లు మృతి చెందాడు. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాదం జరిగితే సాయంత్రం 5 గంటల వరకు క్షతగాత్రుడిని బాపట్ల ఏరియా వైద్యశాలలోనే ఉంచారు. అప్పటికీ అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే ఇంకా గంట సమయం పడుతుందని చెప్పడంతో ఆగ్రహించిన క్షతగాత్రుడి బంధువులు ‘ఇదేం దిక్కుమాలిన ప్రభుత్వం... ఓ వైపు ప్రాణాలు పోతున్నా అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడం ఏంటి?’ అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు అంబులెన్స్‌ను ఆశ్రయించారు. అప్పటికీ మరో అరగంట ఆలస్యం అయింది. మొత్తంగా సుమారు 5 గంటలకుపైగా సమయం గడిచిపోవడంతో వెంకటేశ్వర్లు మృతి చెందాడని ఆయన కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment