బడ్జెట్‌లో దళితులకు ప్రాధాన్యమేదీ?
మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు
చినగంజాం: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ తప్ప మరొకటి కాదని మాల మహానాడు బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేడికొండ సునీల్ విమర్శించారు. ఎస్టీ,ఎస్టీలకు కనీస ప్రాధాన్యం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. మంగళవారు ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపారు. బడ్జెట్‌లో ఎస్సీ కాంపోనెంట్‌కు సంబంధించిన అంచనా రూ.18,487 కోట్లు కేటాయించినట్లు చూపారని అన్నారు. గత ప్రభుత్వం అమలు చేయని 29 ఎస్సీ పథకాలను అధికారంలోకి వచ్చిన వెంటనే పునరుద్ధరిస్తామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు బడ్జెట్‌లో ఆ ప్రస్తావన తీసుకురాలేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టానికి సంబంధించి కేంద్రం ఇచ్చే నిధులతో సర్దుబాటు చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా కూడా కేటాయించలేదని పేర్కొన్నారు. చంద్రన్న పెళ్లికానుకకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదన్నారు. బాలింతలు, పసిబిడ్డల్లో పోషకాహార లోపాలు లేకుండా చేయడానికి నిధులు పెంచాల్సి ఉందన్నారు. కానీ దీనికి బదులు తగ్గించటం సరైన విధానం కాదన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించి రుణాలు, భూమి కొనుగోలు పథకం గురించి ప్రస్తావన ఎక్కడా కనిపించలేదని అన్నారు. రాష్ట్రంలో 17 శాతం దళితులు ఉన్నా వారికి తగినట్లు బడ్జెట్‌లో నిధులు కేటాయించక పోవడం సరికాదన్నారు. ఇది దళితుల హక్కులను కాలరాయడమే అని పేర్కొన్నారు. రాజ్యాంగం దళిత గిరిజనులకు కల్పించిన హక్కులను కాపాడుకోవడం కోసం న్యాయ పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment