కరకట్ట డొల్ల.. బలోపేతం కల్ల!
కృష్ణా వరదలకు అడ్డుగోడగా నిలవాల్సిన కరకట్ట బలహీనంగా తయారై ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. వరదల సమయంలో కృష్ణా పరివాహక ప్రాంతానికి ఎగువన ఉన్న ప్రాంతాలకు రక్షణగా దీన్ని ఏర్పాటు చేసినా పటిష్టత లేక ప్రజలపాలిట శాపంగా మారింది. వరద విపత్తు ముంచుకొచ్చిన సమయంలో కరకట్ట కోతలను అడ్డుకునేందుకు ప్రజలు రేయింబవళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కరకట్టను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం వరదల సమయంలో మాత్రమే యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించడం మినహా ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోవడం లేదు.
కొల్లూరు: కృష్ణా నది కరకట్ట పటిష్టతకు సర్కారు చర్యలు చేపట్టకపోవడం దాని మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చింది. కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలో సుమారు 40 కిలోమీటర్లకుపైగా ఉన్న కరకట్ట గత వరదలకు పలు ప్రాంతాలలో బలహీన పడింది. ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. కొల్లూరు మండలం చిలుమూరు నుంచి జిల్లాలో ఆరంభమయ్యే కరకట్ట.. రేపల్లె మండలం పెనుమూడి వరకు అనేక ప్రాంతాలలో బలహీనంగా మారింది. భవిష్యత్తులో ప్రాణ, ఆస్తి, పంట నష్టాలకు గురవుతామన్న ఆందోళన ప్రజలలో నెలకొంది.
అనుభవాలతో నేర్వని పాఠాలు
కృష్ణా కుడి కరకట్టను పటిష్ట పరిచే విషయంలో గత అనుభావాలను దృష్టిలో ఉంచుకొని స్పందించాల్సిన ప్రభుత్వం పాఠాలు నేర్వలేదు. 2009 వరదల సమయంలో భట్టిప్రోలు మండలం ఓలేరు సమీపంలో కరకట్టకు గండి పడి రేపల్లె పట్టణంతోపాటు అనేక గ్రామాలు ముంపుకు గురయ్యాయి. తీవ్ర పంట, ఆస్తి నష్టం జరిగింది. అనంతరం కరకట్ట పటిష్టత పనులు చేపట్టారు. కానీ కరకట్ట మళ్లీ బలహీనపడింది. రైతులు కోర్టులకు వెళ్లడం కారణంగా కొన్ని ప్రాంతాలలో అభివృద్ధి పనులు నిలిచి పోయాయి. వరదల వేళ ప్రజలే కరకట్ట పొడవునా తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారు. రెండు నెలల క్రితం సంభవించిన వరదల సమయంలో పెదపులివర్రు, చాట్రగడ్డ, పల్లెపాలెం, రావిఅనంతవరం, పెదపులివర్రు, దోనేపూడి, కోటిపల్లి, వెల్లటూరు ప్రాంతాలలో నీరు లీకై ంది. ప్రజలు ఆందోళనకు గురయ్యారు. స్థానికులు, అధికారులు రాత్రింబవళ్లు ఇసుక మూటలు, మట్టి వేశారు. అతికష్టం మీద కరకట్ట తెగకుండా ప్రాణాలకు తెగించి శ్రమించారు.
అక్రమ తవ్వకాలు, పైపులతో ముప్పు
కరకట్ట అంచుల వరకు నిబంధనలను అతిక్రమించి చేపడుతున్న మట్టి తవ్వకాలు, కరకట్ట లోపలి నుంచి సాగు నీటి పైపుల ఏర్పాటుతో ముప్పు పొంచి ఉంటోంది. కరకట్ట అంచులను తవ్వి సేద్యానికి అనువుగా మార్చడం, ఇటుక బట్టీల నిర్వాహకులు నిబంధనలను అతిక్రమించడంతో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోంది. పశ్చిమ బ్యాంక్ కెనాల్ నుంచి అనధికారికంగా కరకట్ట మధ్య నుంచి సాగునీటి పైపులు ఏర్పాటు చేయడంతో దాని మనుగడకు పెనుముప్పుగా మారింది. కృష్ణా నదికి తరచుగా భారీ వరదలు సంభవిస్తుండటంతో ఇప్పటికై నా ప్రభుత్వం కరకట్టను బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని ప్రజలు అభిప్రాయ పడతున్నారు.
పలుచోట్ల బలహీనంగామారిన కృష్ణా కరకట్ట వరదల సమయంలో ప్రజలకు కోతల భయం పటిష్ట పరచడానికి సర్కారు చర్యలు శూన్యం
Comments
Please login to add a commentAdd a comment