‘వివా’ విద్యార్థుల ఆవిష్కరణలు విజయవంతం
పెదకాకాని: ఆలోచన, పరిజ్ఞానాన్ని పంచుకుంటూ సృజనాత్మకతకు సాంకేతిక మేళవింపుతో వివా విద్యార్థులు జర్మనీ విద్యార్థులతో కలసి రూపొందించిన నూతన ఆవిష్కరణలను వివా పాఠశాల వేదికగా శనివారం విజయవంతంగా ప్రదర్శించారు. పెదకాకాని మండలంలోని నంబూరు వీవీఐటీలో మేక్‌థాన్ –2024లో భాగంగా జర్మనీకి చెందిన ఓం విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ బెర్నార్డ్ ఆధ్వర్యంలో వివా పాఠశాలకు చెందిన 13 మంది విద్యార్థులు, జర్మనీ న్యూరెంబర్గ్ నగరానికి చెందిన డ్యూరర్, మార్టిన్ బెహం పాఠశాలలకు చెందిన 13 మంది విద్యార్థులు మూడు బృందాలుగా ఏర్పడి రూపొందించిన మూడు అవిష్కరణలు బ్లైండ్ స్టిక్ (కళ్లులేని వారిని రహదారులపై అప్రమత్తం చేసే చేతికర్ర), ఎకో మోషన్ షూస్, (పల్ప్ పెడల్ ), నాడీ వేగాన్ని అదుపులో ఉంచే సైకిల్ పెడల్‌లను ముఖ్యఅతిథులు మాజీ డీజీపీ మాలకొండయ్య, ప్రముఖ పారిశ్రామికవేత్త లావు నాగేశ్వరరావు, వివా చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకుల సమక్షంలో ప్రదర్శించారు. మాజీ డీజీపీ మాలకొండయ్య మాట్లాడుతూ ప్రాజెక్ట్ ఆధారిత విద్య అనేది విద్యార్థులకు చాలా అవసరమన్నారు. దీని ద్వారా విద్యార్థులు వాస్తవిక ప్రపంచాన్ని అధ్యయనం చేయగలుగుతారన్నారు. మేక్‌థాన్‌లో పాల్గొన్న విద్యార్థులను, సహకరించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అభినందించారు. లావు నాగేశ్వరరావు మాట్లడుతూ సృజనాత్మకత, నైపుణ్యాభివృద్ధికి ఇటువంటి మేక్‌థాన్‌లు ఉపయోగపడుతాయన్నారు.
ప్రొఫెసర్ డాక్టర్ బెర్నార్డ్ మాట్లాడుతూ ఒకే ప్రాంగణంలో కళాశాల, పాఠశాల ఉండటం ద్వారా ఈ మేక్‌థాన్‌లో సాంకేతిక అంశాలలో పరిష్కారాలను సులువుగా సాధించగలిగామన్నారు. గత 6 నెలలుగా విద్యార్థులు ఈ ఆవిష్కరణలకు కృషిచేస్తున్నారన్నారు. చివరిగా ప్రాజెక్ట్ విజయవంతం కావడం సంతోషం కలిగించిందని తెలిపారు. మూడు దశలలో జరిగిన ఈ మేక్‌థాన్‌లో మొదటి దశ అంతర్జాలం ద్వారా నిర్వహించగా ఈ దశలో విద్యార్థులు వారి ఆలోచనలను పంచుకొని మూడు ఆవిష్కరణలను ఎంచుకొన్నారని చెప్పారు. రెండవ దశలో వివా విద్యార్థులు జర్మనీలో నిర్వహించిన మేక్‌థాన్‌లో పాల్గొని అవిష్కరణల రూపకల్పనకు శ్రీకారం చుట్టారని, మూడవ దశలో భాగంగా జర్మన్ విద్యార్థులు వివా పాఠశాలలో నిర్వహించిన మేక్‌థాన్‌కు హాజరై విజయవంతంగా ఆవిష్కరణలను రూపొందించారని వివరించారు. కార్యక్రమంలో చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, వైస్ చైర్మన్ వాసిరెడ్డి మహదేవ్, ప్రిన్సిపాల్ చదలవాడ సరళ, డైరెక్టర్ ఎల్ కమాండర్ కేఎస్ రావు, ఉపాధ్యాయులు ఏకే మాధవి, వై.ప్రసాదరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment