సరికొత్త భావధారలతో పరిపుష్టి
బాపట్ల: ఆధునిక సాహిత్యం పురుడు పోసుకున్నది మొదలు నేటి వరకు అనేక సరికొత్త భావ ధారలతో పరిపుష్టి చెందుతోందని, ఇప్పటికీ సుస్థిరత – సమగ్రత సాధించే దిశగానే కొనసాగుతోందని ప్రముఖ సాహితీ వేత్త ఎన్. వేణు గోపాల్ అన్నారు. నెలనెలా నందివర్ధనం తరతరాల తెలుగు పలుకు 93వ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరయ్యారు. ‘వచన కవిత్వం – ఆధునిక – ఆధునికానంతర పోకడలు‘ అన్న అంశంపై తన విహంగ వీక్షణ ప్రసంగాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎన్.వేణుగోపాల్ మాట్లాడుతూ .. తొలుత ‘ఆధునికత‘ అనే భావజాలం గురించి పరిచయం చేశారు. ఆధునికత అనేది ఎప్పటికప్పుడు సరికొత్తగా కనిపించినా, అనాదిగా అనేక రూపాల్లో తన విశిష్టతను, ప్రాముఖ్యతను నిరంతరతను కొనసాగిస్తూనే ఉన్నదన్నారు. సాహిత్యంలో కూడా ఇదే తరహాలో అనేక ఆధునిక పోకడలు ఆదికవి నన్నయ నాటి నుంచే మొదలైనప్పటికీ స్వతంత్రత లేని కారణంగా, ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితం అయిన కారణంగా, రాజాశ్రయం ఒక్కటే సాహిత్యానికి చిరునామాగా మిగిలిన కారణంగా పరిమితమైన సాహిత్యమే బయటకి వ్యక్తపరచబడి, అదే నేటికీ ప్రదర్శనలో మిగిలిందన్నారు. సమాజం ఆయా రంగాల్లో పరిఢవిల్లుతున్న తీరుగా ఆధునికత సాహిత్యంలో సుస్థిరం చెందిన దాఖలాలు ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు. కార్యక్రమంలో వివేక సర్వీస్ సొసైటీ అధ్యక్షులు ఎన్.వి.వి.నాగరాజు, కార్యదర్శి అంబటి మురళీ కృష్ణ, ధృతి కార్యదర్శి చాపల సుబ్రహ్మణ్యం, కన్వీనర్ పి.శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.
సాహితీవేత్త వేణుగోపాల్
Comments
Please login to add a commentAdd a comment