డిసెంబర్ 14న మెగా లోక్‌అదాలత్
రేపల్లె రూరల్: కక్షిదారుల సమయం, ధనం వృథా కాకుండా రాజీపడదగిన కేసులను పరిష్కరించేందుకే డిసెంబర్ 14న మెగా లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి టీ.వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక సబ్‌కోర్టు హాలులో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే లోక్‌అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. లోక్‌అదాలత్‌లో సివిల్, క్రిమినల్, ప్రీలిటికేషన్ కేసులను పరిష్కరిస్తారని పేర్కొన్నారు. సమావేశంలో వివిధ బ్యాంక్‌ల ప్రతినిధులు, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయ సిబ్బంది, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
మద్యం షాపు వద్దు
వేటపాలెం: నివాసాల మధ్య మద్యం షాపు వద్దంటూ మహిళలు శనివారం అడ్డుకున్నారు. స్థానిక సంతారావూరు రోడ్డు, చీరాల–వేటపాలెం రోడ్డులో సెంటర్‌కి దగ్గరలో నివాస గృహాల మధ్య ఏర్పాటు చేయ తలపెట్టిన మద్యం షాపు ఏర్పాటు చేయవద్దని స్థానిక మహిళలు ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. షాపు ఏర్పాటు చేయతలపెట్టిన యజమానులకు.. ఆందోళనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్సై సంఘటనా స్థలానికి వచ్చి ఆందోళనకారులకు సర్ది చెప్పి విరమింపజేశారు.
అమరేశ్వరాలయంలో కార్తిక సందడి
అమరావతి: అమరావతి క్షేత్రంలోని బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయంలో శనివారం కార్తికమాసం ప్రారంభం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునుంచే అమరేశ్వరాలయంలో భక్తుల సందడి నెలకొంది. భక్తులు పవిత్ర కృష్ణానదిలో కార్తిక స్నానాలు చేసి ఆలయంలో కార్తిక దీపాలు వెలిగించి కార్తిక దామోదరునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరీ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు ఇబ్బందిపడకుండా క్యూలైన్‌లు ఏర్పాటుచేశారు. తాగునీరు, ఉచిత అన్నదానం, ప్రసాదం అందజేశారు. గతేడాది లాగానే గ్రామంలో, ఆలయంలో, స్నానఘాట్‌లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ బందోబస్తు నిర్వహిస్తుంది. అమరావతి ప్రధానవీధిలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద భక్తులకు విద్యుత్ వెలుగులతో స్వాగత తోరణాలతోపాటు రోడ్డు కిరువైపులా విద్యుత్ తోరణాలను ఏర్పాటు చేసి దేవాలయానికి రాజగోపురానికి విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేయటంతో ఆలయంగా శోభాయమానంగా ఉంది.
గుండ్లకమ్మలో దూకి విద్యార్థి ఆత్మహత్య?
మృతదేహం కోసం గాలింపు
అద్దంకి రూరల్: గుండ్లకమ్మ నదిలో దూకి విద్యార్థి ఆత్మహత్య చేసుకు న్న సంఘటన శనివారం సాయంత్రం అద్దంకిలో చోటుచేసుకుంది. సమా చారం అందుకున్న సీఐ కృష్ణయ్య.. ఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అద్దంకిలోని గరటయ్య కాలనీ 19వ లైన్‌లో నివాసం ఉంటున్న దాట్ల శ్రీను కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శ్రీనుకు ఇద్దరు కుమారులు కాగా.. చిన్నవాడైన దాట్ల దుర్గాప్రసాద్ (18) స్థానిక విశ్వభారతి కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం దుర్గాప్రసాద్ తన అన్నతో.. తనకు తిమ్మాయపాలెంలో ఉన్న స్నేహితుడు డబ్బు లు ఇస్తానన్నాడని.. తీసుకుని వస్తాను తోడురమ్మని అన్నతోపాటు బైకుపై తిమ్మాయపాలెంలో బయలుదేరాడు. మార్గంమధ్యలోని గుండ్లకమ్మ నదిమీద ఉన్న బ్రిడ్జి వద్దకు రాగానే డబ్బులు కిందపడ్డాయి అని చెప్పి.. అన్నను బైకు ఆపమన్నాడు. బైకు ఆపగానే అకస్మాత్తు గా పరుగెత్తుకుంటూ వెళ్లి బ్రిడ్జిపై నుంచి నదిలో దూకాడు. అతని అన్న కేకలు వేయటంతో స్థానికులు వచ్చి చూడగా నదిలో కొట్టుకుపోతూ కొంతసేపు కనిపించి ఆ తరువాత మాయ మయ్యాడు. సంఘటనా స్థలానికి చేరకున్న ఎస్సై, సీఐలు, ఫైర్ సిబ్బంది గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. మృతదేహం ఇంకా దొరకలేదు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment