బాధితులకు పరామర్శ
నిజాంపట్నం మండలం గోకర్ణమఠం గ్రామంలోని రాయల్ మైరెన్ సీ ఫుడ్ యూనిట్‌లో శనివారం చోటుచేసుకున్న ప్రమాదంలో పెద్ద సంఖ్యలో కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. యాసిడ్ పెద్ద మొత్తంలో కిందపడిపోవటంతో కంపెనీ సిబ్బంది దానిపై నీరు చల్లారు. ఒక్కసారిగా ఫ్యాక్టరీలో పొగలు కమ్ముకున్నాయి. ఘాటుకు పలువురు అస్వస్థతకు గురై కొంత మంది అపస్మారక స్థితికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న 80మందిని నిజాంపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, మరో 20 మందిని పిట్టలవానిపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిజాంపట్నం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారిలో 30 మంది పరిస్థితి ఇబ్బందికరంగా ఉండడంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ వెంకట మురళి పరిశీలించి ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీనిచ్చారు. ప్రమాదానికిగల కారణాలను పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు. –నిజాంపట్నం
Comments
Please login to add a commentAdd a comment