ఆశా వర్కర్లపై వేధింపులు తగ్గించాలి
బాపట్ల టౌన్: ఆశా వర్కర్లను మానసికంగా వేధింపులకు గురి చేయటం సరికాదని యూనియన్ జిల్లా అధ్యక్షురాలు డి. ధనలక్ష్మి తెలిపారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ధనలక్ష్మి మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలపై కుటుంబ సంక్షేమశాఖ అధికారులు, యూనియన్ నాయకులతో జరిపిన చర్చల్లో కుదిరిన ఒప్పందాల ప్రకారం వెంటనే జీవోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ వయస్సు 60 నుంచి 62 పెంచుతామని చెప్పి నేటి వరకు అమలు చేయలేదని, బెనిఫిట్స్ కూడా అందించడం లేదని తెలిపారు. కనీసం ఒక గంట పర్మిషన్ కావాలన్నా, అత్యవసరమైన రోజు సెలవు పెట్టాలన్నా అధికారుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సులవు కావాలంటే ప్రత్యామ్నాయంగా వేరొకరితో ఒప్పందం చేయిస్తేనే ఇస్తామంటూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. కొత్త రికార్డుల నిర్వహణ ఏప్రియల్ 1 నుంచి నిర్వహించాల్సి ఉండగా, నేటి వరకు వాటిని అందజేయలేదని చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటమురళీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటేశ్వరమ్మ, కోశాధికారి వి. వెంకటేశ్వరమ్మ పాల్గొన్నారు.
యూనియన్ జిల్లా అధ్యక్షురాలు డి. ధనలక్ష్మి కలెక్టరేట్ ముందు ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment