ఇద్దరు హాస్టల్ విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం
సత్తెనపల్లి: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థినుల పట్ల సిబ్బంది దుష్ప్రవర్తన, అసభ్య ప్రవర్తన, వేధింపులకు ఆస్కారం లేకుండా చూడాలని హైకోర్టు స్పష్టంగా నిర్దేశించి నాలుగు రోజులైనా గడవకముందే.. సిబ్బంది వేధింపులతో ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన సంచలనం కలిగించింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ఎస్సీ బాలికల కళాశాల వసతిగృహంలో ఇద్దరు ఇంటర్ విద్యార్థినులు ఉసురు తీసుకోబోయారు. వార్డెన్, సిబ్బంది వేధింపులు, తోటివిద్యార్థినుల ముందు అవమానకరంగా మాట్లాడటాన్ని తట్టుకోలేక వారు ఆదివారం రాత్రి వారు ఆత్మహత్యాయత్నం చేశారు. అధికసంఖ్యలో డోలో–650 మాత్రలు మింగిన వారు ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌లో కోలుకుంటున్నారు. సత్తెనపల్లిలోని వెంకటపతినగర్‌లోగల ఈ హాస్టల్లో 297 మంది విద్యార్థినులు ఉంటున్నారు. ఈ నెల 15న మధ్యాహ్నం మిగిలిన అన్నా న్ని రాత్రి వడ్డించడంతో ఇంటర్ విద్యార్థినులు సంగం అఖిల, అన్నవరపు సనిత ప్రశ్నించారు. దీంతో హాస్టల్ వార్డెన్ రాణెమ్మ, వంట సిబ్బంది వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సనితపై దాడికి యత్నించారు.
వార్డెన్‌కు కౌన్సెలింగ్‌తో సరిపెట్టిన పోలీసులు
ఈ నెల 16న హాస్టల్‌కు వచ్చిన తల్లిదండ్రులకు సనిత ఈ విషయం చెప్పడంతో వారు మిగిలిన విద్యార్థినులతో సంతకాలు చేయించి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వార్డెన్ రాణెమ్మను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఆదివారం కూడా అఖిల, సనితలను వార్డెన్, సిబ్బంది అవమానించారు. దీన్ని తట్టుకోలేక వారిద్దరు మాత్రలు మింగారు. ఆదివారం రాత్రి అస్వస్థతకు గురైన వారిని వార్డెన్ రాణెమ్మ సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment