కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు
చినగంజాం: కిడ్నాప్ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించి నిందితులను కటకటాల్లోకి నెట్టారు. చినగంజాం పోలీస్ స్టేషన్‌లో చీరాల డీఎస్పీ ఎండీ మొయిన్ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బేతాళ వారిపాలెం గ్రామానికి చెందిన పిల్లివెంకట కృష్ణారావు ఫారెక్స్ మార్కెట్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ చేస్తుంటాడు. ఈనెల 17న ఆదివారం ఉదయం సుమారు 6.30 గంటలకు హైదరాబాద్ నుంచి రెండు కార్లలో వెంకట కృష్ణారావు ఇంటికి కొంత మంది వ్యక్తులు వచ్చారు. తమను రియాజ్ పంపించాడని చెప్పి అతనికి ఇవ్వాల్సిన నగదు ఇవ్వాలని భయపెట్టి అతని ల్యాప్ టాప్, మొబైల్ ఫోను లాక్కొని బలవంతంగా అతనిని కారులో ఎక్కించుకొని బైపాస్ రోడ్డులో వెళ్లిపోయారు. దీనిపై కృష్ణారావు బంధువు బెజ్జం హరికృష్ణ చినగంజాం ఎస్‌ఐ శీలం రమేష్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఎస్పీ తుషార్ డూడీకి సమాచారమిచ్చారు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో ఇంకొల్లు సీఐ వైవీ రమణయ్య ఆధ్వర్యంలో ఎస్సై తన సిబ్బంది ఒక బృందంగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. చినగంజాం టోల్‌గేటు వద్ద కార్ల వివరాలు తెలుసుకొని సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కేసు దర్యాప్తు ప్రారంభించి కొద్ది గంటల్లోనే ఆరుగురు నిందితులను గుర్తించి వారిని అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన వారిలో అందరూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కాగా వారిలో రంగారెడ్డి జిల్లాకు చెందిన గుర్రం ఆనంద్‌కుమార్, కరణ్‌కోటి కల్కి, నాగం నరేందర్, బొల్లారం ఉమేష్ రెడ్డి, శ్రీపాద కిరణ్‌కుమార్, హైదరాబాద్‌కు చెందిన జేడ్డోజి సాయికుమార్ ఉన్నారు. ప్రధాన నిందితుడు రియాజ్ పరారీలో ఉన్నట్లు, గాలింపు జరుపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. వారి నుంచి రెండు కార్లు, ఒక ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్‌ను దర్యాప్తు నిమిత్తం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఫేస్ బుక్ పరిచయంతో మొదలు
పిల్లి వెంకట కృష్ణారావుకు, హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ రియాజ్‌లకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైంది. వీరిద్దరు ఫారెక్స్ మార్కెట్‌లో ఆన్‌లైన్ వ్యాపారం చేస్తారు. మార్కెట్‌లో వచ్చే ఒడిదుడుకులను గురించి మాట్లాడుకునేవారు. ఈ నేపథ్యంలో రియాజ్ అకౌంట్‌లో డాలర్లను లావాదేవీలను పిల్లి వెంకట కృష్ణారావు తన అకౌంట్‌లోకి మార్చుకున్నాడని, రియాజ్ పలుమార్లు అడిగినా కృష్ణారావు ఎటువంటి సమాధానం ఇవ్వక పోవడంతో రియాజ్ తన స్నేహితుడు ఆనంద్ కుమార్‌కు చెప్పాడు. ఆనంద్‌కుమార్ స్నేహితులతో కలిసి కృష్ణారావు దగ్గరకు వెళ్లి అతనితో మాట్లాడి వస్తామని చెప్పి ఈనెల 16వ తేదీ రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి 17వ తేదీ ఆదివారం సుమారు 6.30 గంటల ప్రాంతంలో కృష్ణారావును కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్లారు.
పోలీసులు, సిబ్బందిని అభినందించిన ఎస్పీ
కిడ్నాప్ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన చీరాల డీఎస్పీ ఎండీ మొయిన్, ఇంకొల్లు సీఐ వైవీ రమణయ్య, చినగంజాం ఎస్‌ఐ శీలం రమేష్, ఏఎస్‌ఐ జీ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ డీ శ్రీనివాసరావు, హోం గార్డు నాగరాజును ఎస్పీ అభినందించారు. పోలీసులు వేగంగా స్పందించి గంటల వ్యవధిలో కిడ్నాప్ కేసు ఛేదించి బాధితుడిని రక్షించి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
ఆరుగురు నిందితుల అరెస్టు, రెండు కార్లు సీజ్ నిందితులందరూ తెలంగాణ వారే పోలీసులను అభినందించిన ఎస్పీ వివరాలను వెల్లడించిన చీరాల డీఎస్పీ మొయిన్
Comments
Please login to add a commentAdd a comment