జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్
బాపట్లటౌన్: జిల్లాలో 150 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ మీటింగ్ హాల్‌లో ధాన్యం కొనుగోలుపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ 2024–25 ఖరీఫ్‌కు సంబందించి జిల్లాలోని 300 రైతు సేవ కేంద్రాలను 150 క్లస్టర్ పాయింట్లుగా ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో గ్రేడ్–ఏ రకానికి క్వింటాలుకు రూ.2,320, సాధారణ రకానికి క్వింటాలుకు రూ.2,300 చెల్లించనున్నట్టు చెప్పారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన గోతాలు వాహనాలలోకి ఎక్కించటానికి కూలీలకు ఇవ్వాల్సిన హమాలి ఖర్చు, మిల్ పాయింట్‌కు చేర్చటానికి అయ్యే రవాణా ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఒకవేళ రైతులు ఆ ఖర్చును భరించినట్లయితే, ఖర్చు చేసిన సొమ్ము మొత్తం నేరుగా రైతు బ్యాంకు ఖాతాలోకి ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు జమచేస్తామన్నారు. ధాన్యం జీపీఎస్ అమర్చిన వాహనాల్లో మాత్రమే రవాణా చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment