రిలే నిరాహార దీక్షకు దిగిన 108 ఉద్యోగులు
బాపట్ల టౌన్: అత్యవసర సేవలందించే తమకు అవస్థలు తప్పడం లేదని 108 ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ పి. హరిబాబు తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. హరిబాబు మాట్లాడుతూ 108 సర్వీస్‌లను ప్రభుత్వమే నిర్వహించాలని, సిబ్బందిని ప్రభుత్వ వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులగా గుర్తించాలని కోరారు. రోజుకు మూడు షిప్ట్‌ల్లో ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలన్నారు. ప్రభుత్వ నియామకాల్లో 108 ఉద్యోగులకు వెయిటేజ్ మార్కులు అందించాలని డిమాండ్ చేశారు. వైద్యఆరోగ్య శాఖలో చేపడుతున్న ఈఎంటీ పోస్టుల నియామకాల్లో 108లో పనిచేస్తున్న వారిని నియమించాలని కోరారు. జీవో నంబర్ 49 ప్రకారం ప్రతి నెలా ఉద్యోగికి రూ. 4 వేలు అందించాలని విన్నవించారు. ప్రస్తుత నిర్వహణ సంస్థ అరబిందో ఈఎంఎస్ నుంచి ఉద్యోగులకు రావాల్సిన బకాయిల చెల్లింపుల బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని కోరారు. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు రూ. 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందించాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ జి. చందు, ట్రెజరర్ కె. కోటయ్య, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment