వేధింపులు ఆపకపోతే మేమూ కొనసాగిస్తాం
నరసరావుపేట: రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని, రాబోయే రోజుల్లో తాము అధికారంలోకి వస్తే వారు చూపించిన మార్గంలోనే తామూ నడుస్తామని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. సోమవారం స్థానిక సబ్‌జైలు రిమాండ్‌లో ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలు, చిరుమామిళ్ల గ్రామ నాయకుడు సింగారెడ్డి కోటిరెడ్డిని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, న్యాయవాది చిట్టా విజయభాస్కరరెడ్డి, నకరికల్లు పార్టీ మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డిలతో కలిసి పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే పోస్టుపై వివిధ పోలీసుస్టేషన్లో అనేక కేసులు పెట్టించి, అరెస్టులు చేస్తూ చిత్రహింసలు పెట్టి జైళ్లకు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సత్తెనపల్లికి చెందిన పాలూరి రాజశేఖరరెడ్డి అనే సోషల్ మీడియా కార్యకర్త 16 నెలల కిందట పెట్టిన పోస్టుపై నూజివీడులో ఒక కేసు, నకరికల్లులో మరో కేసు పెట్టి చిత్రహింసలు పెడుతున్నారని అన్నారు. పెద్దిరెడ్డి సుధారాణిపై శ్రీకాకుళంలో ఒక కేసు, నరసరావుపేటలో మరో కేసు, మళ్లీ ఈ రోజు చీరాల తీసుకొని వెళ్లారన్నారు. ఆమైపె నాలుగు పీటీ వారెంట్లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. చిరుమామిళ్ల గ్రామంలో సింగారెడ్డి కోటిరెడ్డిని అరెస్టు చేశారని, ఆయన ఎంపీడీవోపై దాడి చేశాడని తప్పుడు ఆరోపణలతో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారన్నారు. ఆయన ఎంపీడీవోను దూషించ లేదని అన్నారు. దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుందని అన్నారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చిట్టా విజయభాస్కరరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నకరికల్లు మండలంలో గతంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులను దూషించినా ఆయనపై ఎటువంటి కేసులు పెట్టలేదని చెబుతూ అప్పుడు అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటలను సెల్ ద్వారా విలేకర్లకు విన్పించారు. జెడ్పీటీసీ సభ్యుడు పదముత్తం చిట్టిబాబు, మండల ఉపాధ్యక్షుడు వెంకటప్పరెడ్డి, యన్నం రాధాకృష్ణారెడ్డి, గంటెనపాటి గాబ్రియల్, గుండాల వెంకటేష్, భూదాల కళ్యాణ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి సబ్‌జైలులో ఉన్న నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలకు పరామర్శ
Comments
Please login to add a commentAdd a comment