ఎన్‌ఎంఎంఎస్ మోడల్ పరీక్షకు 463మంది విద్యార్థులు
చందోలు(కర్లపాలెం): నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం రూ.12వేలు స్కాలర్‌షిప్ అందజేస్తుందని డీఈవోఎస్ పురుషోత్తం తెలిపారు. ఎస్టీయూ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలంలోని చందోలు నీలి బంగారయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఎన్‌ఎంఎంఎస్ మోడల్ టెస్ట్ నిర్వహించారు. బాపట్ల జిల్లాలోని పలు మండలాల నుంచి మొత్తం 463 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో డీఈవో మాట్లాడుతూ విద్యార్థులను చదువులలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్‌ఎంఎంఎస్ మోడల్ టెస్ట్ నిర్వహిస్తుందని తెలిపారు. నిజాంపట్నం ఉన్నత పాఠశాలకు చెందిన పి.సాకేత్ 122 మార్కులతో ప్రథమ, మన్యం లక్ష్మీధర్ 119 మార్కులతో ద్వితీయ, పేటేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి వై.దినేష్‌నాగసాయి 116 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వరుసగా రూ.1500, రూ.1000, రూ.500లను మెమెంటోతో కలసి డీఈవో అందజేశారు. మరో ఐదుగురికి కన్సోలేషన్ బహుమతిగా రూ.500 చొప్పున అందించారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు బడుగు శ్రీనివాసరావు, పీవీపాలెం ఎంఈవో వెంకటేశ్వరరావు, నిజాంపట్నం ఎంఈవో శోభాచంద్, స్ధానిక పాఠశాల హెచ్‌ఎం కనకవల్లి, ఎస్టీయూ నాయకులు, అమర్‌నాథ్, నరసింహారావు, వెంకటేశ్వరరావు, నూర్ బాషా సుభానీ, పిట్టలవానిపాలెం, నిజాంపట్నం ఎస్టీయూ అధ్యక్షులు సాంబశివరావు, తులసీదాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment