25న జిల్లాస్థాయి పర్యావరణ సైన్స్ కాంగ్రెస్
గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లాలో అన్ని యాజమాన్యాల్లోని ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు జిల్లాస్థాయి పర్యావరణ సైన్స్ కాంగ్రెస్–2024 నిర్వహించనున్నారు. ఈ నెల 25న పాత బస్టాండ్ సెంటర్‌లోని జిల్లా పరీక్షా భవన్‌లో ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. చెత్త నుంచి సంపద తయారు చేయడం అనే అంశంపై విద్యార్థులచే వివిధ రకాల నమూనాలను రూపొందించి, ప్రదర్శించేలా సైన్స్ ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలని సూచించారు. ‘‘పర్యావరణ కాలుష్యం – నివారణకు జాగ్రత్తలు’’అనే అంశంపై చిత్రలేఖన పోటీలను నిర్వహించి సర్టిఫికెట్, బహుమతులు అందజేస్తామని తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గైడ్ టీచర్ సహాయంతో పోటీలకు పంపాలని కోరారు. సమాచారం కోసం జిల్లా సైన్స్ అధికారి షేక్ గౌసుల్ మీరా (78428 69407)ను సంప్రదించాలని సూచించారు.
అనుమానంతో భార్య హత్య
పెడసనగల్లు
(మొవ్వ): మొవ్వ మండలం పెడసనగల్లు గ్రామంలో భార్యపై అనుమానంతో భర్త పచ్చడి బండతో తలపై కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన శనివారం వేకువజామున వెలుగు చూసింది. కూచిపూడి ఎస్సై ఎం.సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల మేరకు.... పెడసనగల్లు గ్రామానికి చెందిన శివ పార్వతి (32)కి గుంటూరు జిల్లా, తాడికొండ మండలం, బండారుపల్ల్లి గ్రామానికి చెందిన తుపాకుల అశోక్‌తో 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగ సంతానం, వీరు పెడసనగల్లు గ్రామంలో నివాసం ఉంటున్నారు. శివపార్వతి కూచిపూడిలోని బిర్యానీ హోటల్‌లో పనిచేస్తోంది. భర్త అశోక్ పామర్రు మండలం పరిశేపల్లి గ్రామంలో ఒక రైతు వద్ద పని చేస్తున్నాడు. అశోక్ మద్యానికి బానిసై తరచూ శివపార్వతిని అనుమానిస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి పెడసనగల్లులో ఇంటి వద్ద నిద్రపోతున్న శివపార్వతి తలపై పచ్చడి బండతో కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది. మృతురాలి తల్లి తలుపుల దుర్గ ఆ సమయంలో కేకలు విని అక్కడ వచ్చి చూడగా అశోక్ పరారయ్యాడు. దుర్గ శనివారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సమాచారం తెలుసుకున్న కూచిపూడి ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం, పామర్రు సీఐ వి.సుభాకర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పంచనామా నిర్వహించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment