లక్ష్య సాధనకు కృషి చేయాలి
బూర్గంపాడు: ఉన్నత లక్ష్యాలు సాధించేందుకు విద్యార్థులు ప్రణాళికాయుతంగా చదవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. కృష్ణసాగర్ ప్రభుత్వ గిరిజన గురుకుల కళాశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో సమావేశమై బోధన, తరగతుల నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు క్విజ్ పోటీల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో భోజనం అందించాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అధ్యాపకులకు సూచించారు. బోధన సమయంలో ఏమైనా సందేహాలుంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని విద్యార్థులకు చెప్పారు. చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని అన్నారు. అనంతరం అధ్యాపకుల బోధన తీరును పరిశీలించారు. కళాశాల, హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులు రాత్రి పూట బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అధ్యాపకులు అశోక్‌కుమార్, విజయబాబు, హర్ష తదితరులు పాల్గొన్నారు.
అభ్యర్థుల అభ్యంతరాల స్వీకరణ..
భద్రాచలంటౌన్: ఖమ్మం రీజియన్‌లో గల గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ లెక్చరర్ పోస్టుల నియామకానికి స్వీకరించిన దరఖాస్తుల్లో అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలుంటే స్వీకరించనున్నట్లు పీఓ రాహుల్ తెలిపారు. తాత్కాలిక ప్రొవిజినల్ జాబితాను ప్రదర్శిస్తామని, అభ్యర్థులు తమ అభ్యంతరాలను నవంబర్ 1, 2 తేదీల్లో ఖమ్మం రీజనల్ అధికారి కార్యాలయంలో తెలియజేయాలని సూచించారు.
ఐటీడీఏ పీఓ రాహుల్
Comments
Please login to add a commentAdd a comment