రసాభాసగా రైతుల సమావేశం
చర్ల: తాలిపేరు ప్రాజెక్టు ఆయకట్టు రైతుల సమావేశం బుధవారం రసాభాసగా సాగింది. తమ జోన్లకు నీరివ్వాలంటూ ఇరువర్గాల రైతులు వాగ్వాదానికి దిగారు. మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు పరిధిలో గల చర్ల, దుమ్ముగూడెం మండలాల రైతులకు ఏటా ఖరీఫ్, రబీ పంటలకు సాగునీరు విడుదల చేస్తున్నారు. అయితే ఖరీఫ్‌లో రెండు మండలాల పరిధిలోని 24,700 ఎకరాలకు సాగునీరు సరఫరా చేస్తుండగా, రబీలో రొటేషన్ పద్ధతిలో ఏటా ఒక జోన్‌కు చొప్పున అందిస్తున్నారు. అయితే గతేడాది రబీలో రెండో జోన్‌కు నీరు విడుదల చేయాల్సి ఉండగా, కాలువలు, ప్రాజెక్టు మరమ్మతు పనుల కోసం నీరు సరఫరా చేయడం లేదని అధికారులు ప్రకటించారు. అయితే ఎన్నికల కోడ్‌తో నిధులు రాక మరమ్మతులు చేపట్టకున్నా రెండో జోన్‌కు నీరందించలేదు. అయితే ఈ ఏడాది రొటేషన్ పద్ధతి ప్రకారం తమకే నీరు విడుదల చేయాలని మూడో జోన్ రైతులు, గతేడాది నీరివ్వనందున ఇప్పడు తమకు కేటాయించాలని రెండో జోన్ రైతులు డిమాండ్ చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు జోక్యం చేసుకుని గతేడాది రెండో జోన్‌కు నీరు నిలిపినందున ఈ సంవత్సరం రబీలో రెండో జోన్‌కు ఇవ్వడమే సరైందని, అందుకు అందరూ సహకరించాలని కోరడంతో రైతులు శాంతించారు. కాగా, మార్చి 31 వరకు మాత్రమే నీరు విడుదల చేస్తామని, రబీలో ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని ఇరిగేషన్ అధికారులు సూచించారు. సమావేశంలో ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్, డీఈ మధుసూదన్‌రావు, ఏఈలు ఉపేందర్, ఏఈఓ కీర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment