ముగిసిన గ్రూప్ – 3 పరీక్షలు
● జిల్లాలో 6,312 మంది అభ్యర్థులు గైర్హాజరు
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో గ్రూప్–3 పరీక్షలు సోమవారం ముగిశాయి. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు ఒక పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 వరకు రెండో పరీక్ష జరగగా, సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు మూడో పరీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 39 సెంటర్లలో పరీక్ష నిర్వహించారు. మొత్తం 13,478 మంది అభ్యర్థులకు గాను 7,166 మంది హాజరు కాగా, 6,312 మంది గైర్హాజరయ్యారు. హాజరు శాతం 53.17 శాతంగా నమోదైంది. కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ పరీక్షలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పలు సెంటర్లలో తనిఖీ చేశారు. బయోమెట్రిక్ విధానం ఉండడంతో అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందే చేరుకున్నారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యంకలగకుండా వైద్య, పారిశుద్ధ్య, విద్యుత్ శాఖల అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి కొత్తగూడెం, పాల్వంచకు ప్రత్యేక బస్సులు నడిపింది. అధికారులు పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించగా, పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. ఎలక్టాన్రిక్ పరికరాలను కేంద్రంలోకి అనుమతించలేదు. పరీక్షల నిర్వహణ కోసం అధికారులకు, సిబ్బందికి అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వగా, ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment