● కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్‌పై సీఎం ప్రకటన ● వరంగల్ బహిర
ఆకాశయానం..
అనుకూల పవనం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఎయిర్‌పోర్ట్ నిర్మాణం విషయంలో ఒక్కొక్కటిగా సానుకూల ప్రకటనలు వస్తున్నాయి. తాజాగా వరంగల్ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మిస్తామని ప్రకటించారు. అంతకు ఒకరోజు ముందు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం వరంగల్‌తో పాటు కొత్తగూడెం, రామగుండంలో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. ఈ అంశంపై ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడుకు వినతిపత్రం సమర్పించగా, అక్కడి నుంచి కూడా సానుకూల స్పందన వచ్చింది.
ప్లేస్ మారింది..
కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం అంశం 17 ఏళ్ల నుంచి నలుగుతోంది. కేంద్రమంత్రిగా రేణుకాచౌదరి పని చేసిన కాలంలో ఈ అంశంపై కొంత కదలిక వచ్చింది. సుజాతనగర్ ప్రాంతంలో నిర్మిస్తారనే వార్తలు షికారు చేసినా ఆ తర్వాత ఆగిపోయింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత లక్ష్మీదేవిపల్లి మండలం పునుకుడుచెలక, పాల్వంచ మండలం గుడిపాడు – బంగారుజాల మధ్య ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం పలుమార్లు సర్వే చేసినా సానుకూల నిర్ణయాలు రాలేదు. ప్రస్తుతం కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉండడంతో కొత్తగూడెం సమీపంలోని గరీబ్‌పేట చుట్టూ చుంచుపల్లి, సుజాతనగర్, కొత్తగూడెం మండలాల పరిధిలో ఇంచుమించు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత కొత్తగూడెం ఎయిర్‌పోర్టు విషయంలో కదలిక వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు రోజుకో సానుకూల ప్రకటన వస్తోంది. అయితే ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పూర్తయ్యేంతవరకూ ఇదే ఉత్సాహం కొనసాగాలని జిల్లా వాసులు కోరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment