నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారాన్ని పురస్కరించుకుని శ్రీ అభయాంజనేయస్వామి వారికి అభిషేకం. తమలపాకులతో అర్చన గావించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
న్యాయమూర్తిగా
బాధ్యతలు స్వీకరణ
భద్రాచలంటౌన్: భద్రాచలం జ్యుడీషియల్ ప్రథ మ శ్రేణి న్యాయమూర్తిగా వి.శివనాయక్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన శ్రీసీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోగా అర్చకులు స్వాగతం పలికారు. ఆలయ అధికారులు న్యాయమూర్తికి స్వామి వారి జ్ఞాపికతో పాటు ప్రసాదం అందజేశారు.
21న బాక్సింగ్ ఎంపికలు
కొత్తగూడెంఅర్బన్: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి అండర్ 14, 17, 19 బాలబాలికల బాక్సింగ్ ఎంపికలు ఈనెల 21న కొత్తగూడెం ప్రగతి మైదాన్‌లో నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లాల డీఈఓలు సోమశేఖరశర్మ, వెంకటేశ్వరాచారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు ఆధార్ కార్డు జిరాక్స్, ఫొటోతో కూడిన ఎలిజిబిలిటీ ఫామ్, స్టడీ సర్టిఫికెట్‌తో హాజరు కావాలని సూచించారు. ధ్రువీకరణ పత్రాలు లేకుంటే అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి క్రీడాకారులు హాజరయ్యేలా చూడాలని పీఈటీలు, పీడీలకు సూచించారు.
పీహెచ్‌సీల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తాం
డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్
ఇల్లెందురూరల్: జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలలో సౌకర్యాలు మెరుగుపర్చడంతో పాటు ఖాళీలను కూడా త్వరలో భర్తీ చేస్తామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి భాస్కర్‌నాయక్ తెలిపారు. మండలంలోని కొమరారం పీహెచ్‌సీని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఏయే రకాల మందులు అందుబాటులో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవల స్టాఫ్‌నర్స్‌లు బదిలీ కాగా, కొంత ఇబ్బందిగా ఉందని వైద్యులు చెప్పడంతో త్వరలోనే పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని, చలికాలంలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ లోహిత, సిబ్బంది పాల్గొన్నారు.
‘నవోదయ’ దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు
కూసుమంచి: పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో వచ్చే విద్యాసంవత్సరానికి 9, 11వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం నిర్వహించే ప్రవేశపరీక్ష దరఖాస్తుల గడువు మరోమారు పొడిగించారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారంతో ముగిసిన గడువును 26వ తేదీ వరకు పొడిగించినందున అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment