రామాలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
● ప్రజా సమస్యలపై నిబద్ధతతో పని చేయాలి ● పెండింగ్ పనులపై దృష్టి పెట్టండి ● అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధిపై ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ మేరకు నిధులు మంజూరు చేశామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం భద్రాచలం పర్యటనకు వచ్చిన ఆయన మొదట స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికి శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిలో వేదాశీర్వచనం చేసి స్వామి వారి జ్ఞాపిక, ప్రసాదం అందజేశారు. మంత్రి పొంగులేటి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. మాఢ వీధుల విస్తరణ, భూ సేకరణకు ఇప్పటికే రూ.68 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ఈ ప్రక్రియ అనంతరం ఆలయ అభివృద్దికి తగిన నిధులు విడుదల చేస్తామని తెలిపారు. భద్రాచలంపై సీఎం రేవంత్‌రెడ్డికి అభిమానం ఉందని, అందుకే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారని గుర్తు చేశారు.
సమస్యలు పరిష్కరిస్తేనే మన్ననలు..
ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు నిబద్ధతతో పని చేస్తేనే వారి మన్ననలు పొందగలుగుతారని పొంగులేటి అన్నారు. స్థానిక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీలో గిరిజనుల అభివృద్ధి, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. బీటీ రోడ్లు, చెక్ డ్యామ్‌లు, గిరిజన రైతులకు త్రీఫేస్ విద్యుత్ లైన్, మిషన్ భగీరథ, తాగునీటి సరఫరా వంటి పనులేమైనా పెండింగ్‌లో ఉంటే వెంటనే ప్రారంభించాలని ఆదేశించా రు. మారుమూల గ్రామాల్లో చేపట్టిన పనులకు అటవీ, ఇతర శాఖల అనుమతులు సత్వరమే తీసుకుని పనులు పూర్తయ్యేలా పర్యవేక్షించాలని సూచించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని, ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని అన్నారు. చర్ల మండల కేంద్రంలో డయాలసిస్ సెంటర్ పనులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. ఎంపీ పోరిక బలరామ్ నాయక్ మాట్లాడుతూ చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం మండల కేంద్రాల్లో డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని ఇందిరమ్మ రాజ్యంగా మార్చేందుకు అఽధికారులు సమష్టిగా పనిచేయాలని కోరారు. సమావేశంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ తానాజీ, డీడీ మణెమ్మ పాల్గొన్నారు.
ఆదివాసీ వంటకాలు అదరహో !
ఆదివాసీ సంప్రదాయ వంటకాల రుచులు అదరహో అన్నట్టుగా ఉన్నాయని మంత్రి పొంగులేటి అన్నారు. హౌసింగ్ గెస్ట్‌హౌస్‌లో మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేయగా.. ఆదివాసీల వంటకాలైన కారం వాడకుండా వండిన మటన్, నాటుకోడి కూర, ఆకుకూర పప్పు, అడవి కాకరకాయ చంచల కూర, గంగవాయిల కూర, ఎండు చేపల పులుసు, బొద్దుకూర, పచ్చి మిరపకాయల పచ్చడి, గటక అన్నం, అంబలి, పెసరపప్పు, చేపల ఫ్రై తదితర వంటకాలను వడ్డించారు. ఎలాంటి కల్తీ, కల్మషం లేని వంటకాలు బాగున్నాయని గిరిజన మహిళలను మంత్రి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment