రైల్వేలైన్ల అలైన్‌మెంట్ మార్చండి
ఖమ్మం వన్‌టౌన్: పాలేరు నియోజకవర్గంతో పాటు స్తంభాద్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(సుడా) పరిధిలోని భూముల్లో వెళ్లేలా ప్రతిపాదించిన డోర్నకల్ – మిర్యాలగూడ, డోర్నకల్–గద్వాల రైల్వేలైన్ అలైన్‌మెంట్ మార్చాలని ఖమ్మం ఎంపీ రామసహా యం రఘురాంరెడ్డి కోరారు. సారవంతమైన భూములను రైల్వేలైన్‌కు సేకరించనుండడంతో రైతులు నష్టపోతారని తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఢిల్లీలో రైల్వేబోర్డు చైర్మన్ సతీష్‌కుమార్‌ను కలిసిన ఎంపీ వినతిపత్రం అందజేసి మట్లాడారు. ఖమ్మంలో మూడో రైల్వేలైన్ నిర్మాణం పూర్తికా వొస్తుండగా, ఆరు జాతీయ రహదారులతో అనుసంధానం ఉందని తెలిపారు. ఈ నేపధ్యాన కొత్త రైల్వే లైన్‌తో ప్రజలకు నష్టమే తప్ప లాభం ఉండదని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రత్యామ్నాయంగా డోర్నకల్ వయా వెన్నారం, మన్నెగూడెం, మరిపెడ, మోతే మీదుగా లైన్ నిర్మించాలని కోరారు. తద్వారా దూరంతో పాటు భూసేకరణ, నిర్మాణం వ్యయం తగ్గుతుందని తెలిపారు. ఈమేరకు తన వినతితో రైల్వేబోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించారని ఎంపీ ఓ ప్రకటనలో వెల్లడించారు.
పీఎం ఉజ్వల యోజనపై..
ఆదివాసీ, గిరిజనులు వంటగ్యాస్ రీఫిల్లింగ్ కోసం పడుతున్న కష్టాలను పరిష్కరించాలని ఎంపీ రఘురాంరెడ్డి కోరారు. గ్యాస్ కనెక్షన్ల అంశంపై ఆయన గురువారం పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నలకు కేంద్ర పెట్రోలియం, సహజవాయువులు, పర్యాటక శాఖల సహాయ మంత్రి సురేష్‌గోపి సమాధానమిచ్చారు. 2016 నుంచి ఇప్పటివరకు ఖమ్మంలో 83,176, భద్రాద్రి జిల్లాలో 71,556 మందికి పీఎం ఉజ్వల యోజన ద్వారా గ్యాస్ కనెక్షన్లు జారీ చేయడమే కాక రీఫిల్లింగ్, సబ్సిడీ కొనసాగిస్తున్నామని తెలిపారు. అలాగే, వంటనూనెలపై ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజాపంపిణీ శాఖల సహాయ మంత్రి నిముబెన్ జయంతిభాయ్ సమాధానమిచ్చారు.
రైల్వే బోర్డు చైర్మన్‌ను కోరిన
ఎంపీ రఘురాంరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment