విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
సుజాతనగర్ : గురుకుల విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సిబ్బందికి సూచించారు. గురువారం ఆయన వేపలగడ్డలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. విద్యాలయ ప్రాంగణం, వంటగదులు, విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. విద్యాలయం నిర్వహణలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని పాఠశాల ప్రిన్సిపాల్ బ్యూలారాణిని అడిగి తెలుసుకున్నారు. తాత్కాలిక భవనంలో గురుకుల విద్యాలయాన్ని ఏర్పాటు చేశామని, పక్కా గృహం కావాలని కలెక్టర్‌ను కోరగా వారం రోజుల్లో ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పౌష్టికాహారం అందిస్తేనే విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. అనంతరం డేగలమడుగులోని మంజీత్ కాటన్ జిన్నింగ్ మిల్లును పరిశీలించి పత్తిలో తేమ శాతం, ధర కొనుగోలు విధానాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నాగరాజు, ఏఓ నర్మద తదితరులు పాల్గొన్నారు.
గురుకుల సిబ్బందికి కలెక్టర్ ఆదేశం
డేటా ఎంట్రీ త్వరితగతిన పూర్తి చేయాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): సమగ్ర సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం ఆయన అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందనతో కలిసి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసక్తి కలిగిన యువతీ యువకులను డేటా ఎంట్రీ చేయడానికి నియమించుకోవాలని సూచించారు. తహసీల్దార్లు తమ పరిధిలోని విద్యాసంస్థల కంప్యూటర్ ల్యాబ్‌లను ఉపయోగించుకోవాలన్నారు. కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, కరకగూడెం, చర్ల మండలాల్లో డేటా ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఎంట్రీని అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. చండ్రుగొండ, ములకలపల్లి, ఇల్లెందు మండలాల్లో భూ సమస్యలపై ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయని, తమ పరిధిలోని సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై నివేదికలు సమర్పించాలని తహసీల్దార్లకు సూచించారు. కొత్తగూడెం, టేకులపల్లి, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల పరిధిలో ఎమ్మెల్యేల సమన్వయంతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల స్థాపనకు అనువైన ప్రదేశాలను గుర్తించి నివేదికలు అందజేయాలని కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీఓలను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment