కిన్నెరసాని అభయారణ్యంలోకి ప్రవేశించిందా..?
గుండాల: మూడు, నాలుగేళ్లుగా జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చలికాలంలో జాతీయ జంతువు అడుగుజాడలు కనిపిస్తుండగా, ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలకు కంటిమీద కునుకు ఉండటంలేదు. మళ్లీ పులి వచ్చిందని అటవీశాఖ అధికారులు చెబుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో పులి వచ్చినట్లు ప్రచారం సాగుతుండటంతో ప్రజలు వణికి పోతున్నారు. మూడు రోజులపాటు ములుగు జిల్లాలో సంచరించిన పులి మంగపేట, మల్లూరు అటవీ ప్రాంతాల నుంచి సరిహద్దు దాటి జిల్లాలోకి అడుగుపెట్టిందనే సమాచారం అటవీశాఖ అధికారులకు అందింది. దీంతో గుండాల, ఆళ్లపలి, రేగళ్ల, కాచనపల్లి ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గురువారం తెల్లవారు జామున మల్లూరు గుట్టవైపు వెళ్లిందని పేర్కొంటున్నారు. దామరతోగు, రేగళ్ల, మర్కోడు, అడవిరామారం, కొమరారం అటవీ ప్రాంతాల్లోని నీటి కొలను, దారి మార్గాల్లో పులి అడుగుజాడలను గుర్తించే పనిలో ఉన్నారు. అడవుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పశువుల కాపరులు అడవులకు వెళ్లొద్దని, వ్యవసాయ పనులకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. తాడ్వాయి అడవి దాటిన పెద్దపులి దామరతోగు, రేగళ్ల, అడవిరామారం అడవి మార్గంలోని కిన్నెరసాని అభయారణ్యంలోకి ప్రవేశించవచ్చని భావిస్తున్నారు. ఎక్కడ ఏం జరుగుతుందోనని గిరిజన గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment