స్కిల్డ్ పేసర్‌గా పాపులర్ అయిన భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా తండ్రి అయిన ఆనందంలో మునిగి తేలుతున్నాడు. బుమ్రా భార్య సంజనా గణేశన్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్న బుమ్రా అంగద్ జస్ప్రీత్ బుమ్రా అంటూ తన బుజ్జాయి పేరును కూడా ప్రకటించేశాడు. దీంతో బుమ్రా-సంజన దంపతులకు అభినందనల వెల్లువ కురుస్తోంది. ఫ్యాన్స్ కూడా తెగ సంతోష పడిపోతున్నారు. ఈ క్రమంలో బుమ్రా నెట్‌వర్త్, కార్లు తదితర ఆస్తులపై ఆసక్తి నెలకొంది.
అరంగేట్రంలోనే అందరి దృష్టినీ ఆకర్షించి, క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లలో జట్టులో కీలక క్రికెటర్‌గా ఎదిగిన వాడు బుమ్రా. తనదైన స్పెషల్ బౌలింగ్ యాక్షన్ , యార్కర్లతో నిలకడైన బౌలింగ్ సామర్థ్యంతో పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బుమ్రా తరువాతే ఎవరైనా. ఇప్పటివరకు తన చిన్న కెరీర్‌లో, బుమ్రా 2019లో ICC ODI ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. బుమ్రా 2013 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతూ జట్టుకు కీలక టైటిళ్లను అందించిన ఘనత కూడా సొంతం చేసుకున్నాడు. మరి ఇంత పాపులర్ అయిన బుమ్రా సంపాదన, ఇతర వివరాలను పరిశీలిస్తే..
వివిధ మీడియా నివేదికల ప్రకారం 2023 మార్చి నాటికి జస్ప్రీత్ బుమ్రా నికర విలువ రూ. 55 కోట్లు(7 మిలియన్ డాలర్లు)గా అంచనా. అలాగే కాంట్రాక్టు ఆటగాళ్లకు బీసీసీఐ చెల్లింపు విధానం ప్రకారం బుమ్రా వార్షిక వేతనం రూ.7 కోట్లు. దీనికి తోడు భారత జట్టు కోసం ఆడే ప్రతి టెస్ట్, ODI, T20I మ్యాచ్‌లకు అందే రెమ్యునరేషన్ వరుసగా రూ. 15 లక్షలు, రూ. 6 లక్షలు , రూ. 3 లక్షలు.
బ్రాండ్లు
భారత క్రికెట్ జట్టు గ్రౌండ్‌లో స్టార్ క్రికెటర్‌గానే కాదు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టీమ్ కాంట్రాక్టులు,బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు ద్వారా కూడా బుమ్రా సంపాదన పెరుగుతూనే ఉంది. బుమ్రా డ్రీమ్11, ఆసిక్స్, వన్‌ప్లస్ వేరబుల్స్, జాగల్, బోట్, సీగ్రామ్ రాయల్ స్టాగ్, కల్ట్స్‌పోర్ట్, ఎస్ట్రోలో, యునిక్స్ భారత్ పే వంటి అనేక ప్రసిద్ధ బ్రాండ్‌లు అతని చేతిలో ఉన్నాయి. ప్రముఖ క్రికెట్ యాంకర్ సంజనా గణేశన్‌తో పెళ్లి తరువాత బుమ్రా పూణేలోని అనేక ఆస్తులతో పాటు, ముంబైలో సుమారు రూ. 2 కోట్ల విలువైన లగ్జరీ ఇల్లును సొంతం చేసుకున్నాడు. 2015లో అహ్మదాబాద్‌లో విలాసవంతమైన డిజైనర్ ఇంటిని కొనుగోలు చేశాడు.దీని విలువ ప్రస్తుతం రూ. 3 కోట్లు. ఈ ఆస్తులతో పాటు దేశ వ్యాప్తంగా పలు రియల్ ఎస్టేట్ ఆస్తులను కూడా కలిగి ఉన్నాడు.
లగ్జరీ కార్లు: బుమ్రా గ్యారేజీలో రూ. 2.54 కోట్ల విలువైన మెర్సిడెస్-మేబ్యాక్ S560, రూ. 2.17 కోట్ల విలువైన నిస్సాన్ GT-R, రూ. 90 లక్షల విలువైన రేంజ్ రోవర్ వెలార్ , టయోటా ఇన్నోవా క్రిస్టా ఉన్నాయి. వీటి విలువ రూ.25 లక్షలు.
కాగా బుమ్రా డిసెంబర్ 6, 1993న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించాడు. తన సొంత రాష్ట్రం గుజరాత్ కోసం ఆడుతున్న క్రమంలో ముంబై ఇండియన్స్ ద్వారా ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. 2013లో, జస్ప్రీత్ తన తొలి ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కేవలం 32 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియాలో జస్ప్రీత్ బుమ్రా జనవరి 2016లో, జస్ప్రీత్ ఆస్ట్రేలియాపై అంతర్జాతీయ T20 అరంగేట్రం చేసాడు. ఇప్పటివరకు తన కెరీర్‌లో, బుమ్రా 2019లో ICC ODI ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెల్చుకున్నాడు.
ఆసియా కప్ కోసం శ్రీలంకలో ఉన్న జస్ ప్రీత్ బుమ్రా ఇండియాకు తిరిగి రావడంతో ఫ్యాన్స్‌ను గందరగోళంలో పడేసిన సంగతి తెలిసిందే. ఆసియా కప్ 2023 (Asia Cup 2023)లో భాగంగా భారత్, పాకిస్తాన్ (IND vs PAK మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా నేపాల్‌తో జరగనున్న మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే, సూపర్-4కు అర్హత సాధిస్తుంది. ఆ భారత్ సూపర్-4కు క్వాలిఫై అయిన తరువాత పాకిస్తాన్‌తో సెప్టెంబర్ 10న తదుపరి మ్యాచ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం తండ్రిగా ప్రమోట్ అయిన ఆనందంలో ఉన్న బ్రుమా సూపర్-4 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment