పేటీఎం ( Paytm )పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిషేధం మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించింది. దీంతో లక్షలాది యూజర్లు గందరగోళానికి గురవుతున్నారు. రకరకాల సందేహాలు వారిని వేధిస్తున్నాయి. వీటన్నింటికీ సమాధానంగా.. యూజర్లకు సహాయకరంగా స్పష్టత ఇచ్చేందుకు ఆర్బీఐ తాజాగా తరచుగా అడిగే ప్రశ్నల (FAQ) సమగ్ర సెట్‌ను ప్రచురించింది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై జనవరి 31న ఆర్బీఐ నిషేధాన్ని ప్రకటించింది. ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ల నుంచి ఎలాంటి డిపాజిట్లు స్వీకరించడానికి వీల్లేదంటూ ఆదేశించింది. అయితే అన్ని లావాదేవీలను నిలిపివేసే గడువును మార్చి 15 వరకు పొడిగించడం ద్వారా వ్యాపారాలకు కొంత ఊరటను అందించింది. ఈ క్రమంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తర్వాత ఏం జరుగుతుంది.. ఎలాంటి సర్వీసులు అందుబాటులో ఉంటాయి ఇలాంటి 30 ప్రశ్నలపై సెంట్రల్ బ్యాంక్ ఎఫ్‌ఏక్యూ సమగ్ర సెట్‌ను ప్రచురించింది. ఈ ఎఫ్‌ఏక్యూ పత్రం వాటాదారుల అన్ని ఆందోళనలను పరిష్కరించడానికి ఉద్దేశించిందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఉద్ఘాటించారు.
పేటీఎంపై ఆర్బీఐ ఎఫ్‌ఏక్యూ సెట్‌లోని కొన్ని ప్రశ్నలు..
కరెంట్, సేవింగ్స్ ఖాతాదారుల పరిస్థితి ఏంటి?
ఆర్బీఐ ప్రకటన ప్రకారం.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాదారులు 2024 మార్చి 15 తర్వాత ఈ ఖాతా నుంచి నిధులను విత్‌డ్రా చేయడం లేదా బదిలీ చేయడం కొనసాగించవచ్చు. మీ ఖాతాలో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ వరకు నిధులను ఉపసంహరించుకోవడానికి లేదా బదిలీ చేయడానికి డెబిట్ కార్డ్‌ని ఉపయోగించవచ్చు.
మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లోని మీ ఖాతాలో డబ్బును జమ చేయలేరు. వడ్డీ, క్యాష్‌బ్యాక్‌లు, భాగస్వామ్య బ్యాంకుల నుంచి స్వీప్-ఇన్ లేదా రీఫండ్‌లు మినహా ఇతర క్రెడిట్‌లు లేదా డిపాజిట్లు క్రెడిట్ చేయడానికి వీల్లేదు.
మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో రీఫండ్?
అవును.. రీఫండ్‌లు, క్యాష్‌బ్యాక్‌లు, భాగస్వామి బ్యాంకుల నుంచి స్వీప్-ఇన్‌లు లేదా వడ్డీలు మార్చి 15 తర్వాత కూడా మీ ఖాతాలోకి క్రెడిట్ అయ్యేందుకు అనుమతి ఉంది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో జీతం, ఈఎంఐ లింక్ అయితే ఎలా?
మార్చి 15 తర్వాత, వినియోగదారులు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలోకి ఎలాంటి జీతం క్రెడిట్‌లను పొందలేరు. అసౌకర్యాన్ని నివారించడానికి మీరు మార్చి 15 లోపు మరొక బ్యాంకుతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్, విద్యుత్ బిల్లులు, రివార్డ్‌లు?
మీ ఖాతాలో బ్యాలెన్స్ అందుబాటులో ఉండే వరకు ఆటోమేటిక్ యూపీఐ మ్యాండేట్ ద్వారా ఉపసంహరణ/డెబిట్‌కు వీలుంటుంది. అయితే మార్చి 15 తర్వాత మీ ఖాతాల్లో క్రెడిట్ లేదా డిపాజిట్ అనుమతించబడదు. అసౌకర్యం లేదా అంతరాయాన్ని నివారించడానికి మార్చి 15 లోపు మరొక బ్యాంకు ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.
సబ్సిడీ లేదా డీబీటీ?
మార్చి 15 తర్వాత మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో మీ ఖాతాలోకి అలాంటి క్రెడిట్‌ను స్వీకరించలేరు. ఏదైనా అసౌకర్యం లేదా అంతరాయాన్ని నివారించడానికి దయచేసి మార్చి 15 లోపు మీ లింక్ చేయబడిన ఖాతాను మరొక బ్యాంకుకు మార్చడానికి ఏర్పాట్లు చేసుకోండి
పేటీఎం వాలెట్ గురించి?
వినియోగదారులు వాలెట్‌లో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ వరకు ఉపయోగించడం, ఉపసంహరించుకోవడం లేదా మరొక వాలెట్ లేదా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయడం కొనసాగించవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే మార్చి 15 తర్వాత వినియోగదారులు ఈ వాలెట్‌లోకి క్యాష్‌బ్యాక్‌లు లేదా రీఫండ్‌లు కాకుండా మరే ఇతర క్రెడిట్‌లను టాప్-అప్ చేయలేరు లేదా వాలెట్‌లోకి బదిలీ చేయలేరు.
Comments
Please login to add a commentAdd a comment