డీఎఫ్‌ఓ బాధ్యతల స్వీకరణ
చిత్తూరు కార్పొరేషన్: డీఎఫ్‌ఓగా భరణి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ నుంచి ఆమె ఇక్కడికి బదిలీపై వచ్చారు. జిల్లాలోని రేంజర్లు, సిబ్బంది ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. చిత్తూరు జిల్లాపై కొద్దిపాటి అవగాహన ఉందన్నారు. జిల్లా అంతటా పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుంటానన్నారు. ఉద్యోగుల సహకారంతో కలిసి పనిచేస్తానని వివరించారు.
14న ఐటీఐలో అప్రెంటిస్ మేళా
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 14వ తేదీన అప్రెంటీస్ మేళా నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. 14వ తేదీ ఉదయం నిర్వహించే ఈ మేళాకు ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో శిక్షణ పూర్తి చేసి ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. ముందస్తుగా ఐబీఎం పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. లేనిపక్షంలో నేరుగా తమ కార్యాలయంలో ఈ నెల 14న నిర్వహించే అప్రెంటీస్ మేళాకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ మెగా అప్రెంటిస్ మేళాకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు పాల్గొంటాయని, ఈ సదవకాశాన్ని జిల్లాలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు 90306 57957ను సంప్రదించాలని ప్రిన్సిపల్ కోరారు.
మద్యం దుకాణాలకు 1500 దాటిన దరఖాస్తులు
చిత్తూరు అర్బన్: జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం పోటీపడుతున్న వారి సంఖ్య 1500 దాటింది. జిల్లాలోని 104 ప్రైవేటు మద్యం దుకాణాల నిర్వహణ కోసం అధికారులు టెండర్లు ఆహ్వానించగా, ఇప్పటి వరకు 1570 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. బుధవారానికి గడువు ముగియాల్సి ఉండగా, దీన్ని ఈనెల 11వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వచ్చిన దరఖాస్తులను లాటరీ పద్ధతి ద్వారా ఈ నెల 14వ తేదీన డిప్ తీసి దుకాణాలను కేటాయించనున్నారు. డిప్‌లో దుకాణాలు దక్కించుకున్న వాళ్లు ఈనెల 16వ తేదీ నుంచి మద్యం వ్యాపారం చేసుకోవచ్చు. ఇక ఎకై ్సజ్ సర్కిల్ వారీగా వచ్చిన దరఖాస్తులు పరిశీలిస్తే, చిత్తూరు అర్బన్‌లో 22 దుకాణాలకు 348, చిత్తూరు రూరల్‌లో 19 దుకాణాలకు 365, కార్వేటినగరంలో 8 దుకాణాలకు 182, నగరిలో 11 దుకాణాలకు 154, పుంగనూరులో 14 దుకాణాలకు 101, పలమనేరు 13 దుకాణాలకు 145, కుప్పంలో 10 దుకాణాలకు 241, పులిచెర్లలో 7 దుకాణాలకు 37 దరఖాస్తులు అందగా, రెండు దుకాణాలకు సింగిల్ టెండర్లే పడ్డాయి. రూ.2 లక్షల నాన్ రీఫండబుల్ రుసుము ద్వారా ఇప్పటివరకు జిల్లా నుంచి ప్రభుత్వానికి కేవలం దరఖాస్తు చేసుకోవడం ద్వారా రూ.15.70 కోట్ల ఆదాయం లభించినట్లు తెలుస్తోంది.
లింగ నిర్ధారణ చేస్తే
చర్యలు తప్పవు
కాణిపాకం: నిబంధనలకు విరుద్ధఃగా లింగ నిర్ధారణ చేస్తే స్కానింగ్ సెంటర్లను సీజ్ చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రభావతిదేవి హెచ్చరించారు. సాక్షి దినపత్రికలో బుధవారం ఆ బిడ్డయితే అంతమే అనే శీర్షికన వార్తా కథనం ప్రచురితమైంది. దీనిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించారు. లింగ నిర్ధారణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గర్భిణులు జిల్లాలోని స్కానింగ్ సెంటర్లను ఆశ్రయించడం ఏమిటని ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులకు వివరణ ఇచ్చుకున్నారు. లింగ నిర్ధారణ కట్టడికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీ పనిచేస్తోందన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న లింగనిర్ధారణపై నిఘా ఉంచాలని మండల వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. డెకాయి ఆపరేషన్‌ను పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే తొలిసారి నోటీసులు ఇస్తామన్నారు. మరోమారు కొనసాగితే స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేస్తామన్నారు. గర్భనిరోధక మందుల వినియోగంపై డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సహకారంతో మందుల షాపుపై దాడులు చేపడుతున్నామన్నారు. ఆశా, ఏఎన్‌ఎంలు గర్భస్థ లింగ నిర్ధారణకు సహకరిస్తున్నారని తేలితే కచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్‌ఎంపీ క్లినిక్‌లు నిబంధనలకు విరుద్ధంగా చికిత్స చేస్తే క్లినిక్‌లను సీజ్ చేస్తామని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment