ఫైళ్లు పెండింగ్ ఉంటే చర్యలు తప్పవు
● జాయింట్ కలెక్టర్ విద్యాధరి
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని రెవెన్యూ కార్యాలయాల్లో ఉద్దేశపూర్వకంగా వివిధ రకాల ఫైళ్లను పెండింగ్ లో పెడితే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ విద్యాధరి హెచ్చరించారు. శనివారం ఆమె కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజలకు సంబంధించిన ఎటువంటి ఫైళ్లను పెట్టకుండా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. ఉన్నతాధికారులకు పంపాల్సిన ఫైళ్లను ఎప్పటికప్పుడు పంపాలన్నారు. క్షేత్రస్థాయిలో ఫైళ్లు పెండింగ్ లేకుండా ఉండేందుకు ప్రత్యేక విధానం అమలు చేస్తున్నామన్నారు. రెవెన్యూ శాఖలో 30 రకాల సబ్జెక్టులకు సంబంధించి ప్రత్యేక ఫ్రొఫార్మను తయారు చేసి క్షేత్రస్థాయిలో ఆర్డీఓ, తహసీల్దార్లకు పంపినట్లు చెప్పారు. ఆ ఫ్రొఫార్మాలో కార్యాలయానికి ఫైల్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు, సబ్జెక్ట్ ఏమిటి అనే వివరాలు నమోదు చేసి, ప్రతి రోజు కలెక్టరేట్‌కు పంపాల్సి ఉంటుందన్నారు. ఆ ఫ్రొఫార్మాను అనుసరించి ప్రతి వారం సమీక్ష చేసి పెండింగ్ ఫైళ్ల పురోగతిని అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
30లోపు రీ సర్వే గ్రామ సభలు పూర్తి
జిల్లా వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీ లోపు రీ సర్వే గ్రామ సభలు పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. క్షేత్రస్థాయిలో షెడ్యూల్ ప్రకారం అన్ని మండలాల్లో రీ సర్వే గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 303 గ్రామ సభలు నిర్వహించినట్లు చెప్పారు. ఇంకా 26 గ్రామ సభలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన గ్రామ సభల్లో మొత్తం 15,605 దరఖాస్తులు ప్రజలు నుంచి అందినట్లు తెలిపారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 3,439, రీ సర్వే సమస్యల ఫిర్యాదులు 12,166 అందినట్లు వెల్లడించారు. ఆ ఫిర్యాదులను వచ్చే నెల లోపు పూర్తి చేసేందుకు కసరత్తు చేపడుతున్నామన్నారు. రీ సర్వే దరఖాస్తులను పరిష్కరించే విధానంపై క్షేత్రస్థాయి సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామని తెలిపారు.
అర్జీల పరిష్కారానికి ప్రత్యేక విధానం
ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో రెవెన్యూ సమస్యలు అధికంగా వస్తున్నాయని జేసీ చెప్పారు. రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు.
రికార్డులు డిజిటలైజేషన్
ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల రికార్డులను పారదర్శకంగా డిజిటలైజేషన్ చేసే ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు జేసీ వెల్లడించారు. ఈ ప్రక్రియను ఈ నెల 30 లోపు పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment