ఔట్ సోర్సింగ్
పారిశుద్ధ్యం..
పేరుకే మున్సిపల్ హోదా.. వేళ్లపై లెక్క కట్టేలా శాశ్వత పారిశుద్ధ్య సిబ్బంది.. మిగిలిన వారంతా ఔట్ సోర్సింగ్ కార్మికులు.. ఆ సంఖ్య కూడా అరకొరే.. వెరసి కనిపించని పారిశుద్ధ్య పురోగతి.. ఉన్న కార్మికులకు ఇబ్బంది.. ఫలితం.. పడకేసిన పారిశుద్ధ్యం.. ప్రబలుతున్న వ్యాధులతో జనం సతమతం.. ఇదీ మున్సిపాలిటీల్లో పరిశుభ్రత దుస్థితి.
పుంగనూరు:మున్సిపాలిటీల్లో ప్రజారోగ్యశాఖ ఆర్భాటాలతో కాలం గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారే అధికంగా పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పనిచేస్తున్నారు. ము న్సిపాలిటీలను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేస్తామని ఉపన్యాసాలిచ్చే నేతలు పారిశుద్ధ్య కార్మికులపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరం. మున్సిపాలిటీల నిబంధనల మేరకు 500 మంది జనాభాకు ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు ఉండాలి. ఈ జనాభా ప్రాతిపదికన పారిశుద్ధ్య కార్మికులను నియమించి, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి. కానీ వాటిని ప్రభుత్వం గాలికి వదిలేసింది. కార్మికుల నియామకాలు చేపట్టకుండా ఉన్న వారితో పనులు చేయించడంతో మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం పడకేసింది. ఫలితంగా ప్రజలకు దోమల బెడద అధికమై, రోగాల భారిన పడి ఆస్పత్రులపాలవుతున్నారు. వైద్యం కోసం రూ.వేలు చెల్లించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
1985 నుంచి నియామకాలు నిల్
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికుల నియామకాలను 1985లో నిర్వహించారు. అప్పటి నుంచి నేటి వరకు కార్మికుల నియామకాలు చేపట్టలేదు. ఉన్న కార్మికులు ఉద్యోగ విరమణ చేయడం, అనారోగ్యంతో చనిపోవడం లాంటి కారణాలతో కార్మికుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. ఔట్‌సోర్సింగ్ కార్మికులతోనే పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ జరగడం బాధాకరం. వారికి ప్రమోషన్లు, టీఏలు, డీఏలు లేకపోయిన ప్రజారోగ్యం కోసం జీవితాంతం కష్టపడడం పలువురిని కలచివేస్తోంది. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో జనాభా సంఖ్య మాత్రం అమాంతం పెరిగిపోతోంది. అన్నిశాఖల్లో నియామకాలు చేపడుతామనే ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల నియామకాలు చేపట్టపోయిన ఔట్‌సోర్సింగ్ వారిని పర్మినెంట్ చేసి, కొత్తవారిని ఔట్‌సోర్సింగ్ కింద తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
పారిశుద్ధ్య కార్మికులే లేరు
ఆర్భాటాలకే పరిమితం
1985 నుంచి నియామకాలు నిల్
జిల్లాలోని మున్సిపాలిటీల వారీగా వివరాలివీ..
పేరు జనాభా వార్డులు పర్మినెంట్ ఔట్‌సోర్సింగ్ కార్మికుల కార్మికుల
ఉద్యోగులు సంఖ్య అవసరం
పుంగనూరు 65,333 31 25 85 110 170
పలమనేరు 68,000 26 18 79 97 170
కుప్పం 56,000 21 42 70 112 150
చిత్తూరు 2,08,000 50 92 361 453 650
నగరి 60,000 29 3 89 93 150
మొత్తం 4,57,333 147 120 684 865 1,290
మూలన పడిన ట్రాక్టర్లు
మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా వినియోగించే ట్రాక్టర్లు, ఆటోలు, తోపుడుబండ్లు మూలనపడ్డాయి. వాటి మరమ్మతులు నిర్వహణ సక్రమంగా చేపట్టకపోవడంతో చెత్తను తరలించడం కష్టతరమవుతోంది. ఒక వైపు కార్మికులు లేకపోవడం, మరో వైపు వాహనాలు లేకపోవడంతో ఒక రోజు చెత్తను తొలగించేందుకు రెండు రోజులు పడుతోంది. ఫలితంగా పారిశుద్ధ్యం పడకేస్తోంది.
కార్మికుల కొరత
జిల్లాలో ఐదు మున్సిపాలిటీలున్నాయి. పుంగనూరు, చిత్తూరు, నగరి, పలమనేరు, కుప్పం. వీటిలో పారిశుద్ధ్య కార్మికుల కొరత తీవ్రంగా ఉండడంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారాయి. చిత్తూరు 1917లో మున్సిపాలిటీగా మార్పు చెందింది. పుంగనూరుకు 1985లో మున్సిపల్ హోదా వచ్చింది. పలమనేరు, నగరి 2005లో, కుప్పం 2020లో మున్సిపాలిటీల హోదా కల్పించారు. అయినా పారిశుద్ధ్య కార్మికులను నియమించకపోవడంతో కార్మికుల కొరత తీవ్రంగా ఉంది.
నిబంధనలకు నీళ్లు
మున్సిపాలిటీ నిబంధనల మేరకు రెండు కిలోమీటర్ల పరిధికి ఒక స్వీపర్, ఒక డ్రైన్ క్లీనర్, ఆటోకు ఇద్దరు కార్మికులు, అందులో ఒకడ్రైవర్, ఒక లోడర్, ట్రాక్టర్‌కు ఒక డ్రైవర్, ముగ్గురు లేదా నలుగురు క్లీనర్లు, 50 వేలకు పైబడిన జనాభా కలిగిన మున్సిపాలిటీకి 150 మంది కార్మికులకు పైగా ఉండాలన్నది నిబంధన. అయితే ఈ నిబంధనలకు ప్రభుత్వం నీళ్లు వదిలిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment