29న ఆయుర్వేద వైద్య శిబిరం
కాణిపాకం: వరసిద్ధుని క్షేత్రంలో ఈ నెల 29న ఉచితంగా ఆయుర్వేద మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. కాణిపాకంలోని ఆస్థాన మండపంలో ఈ క్యాంపును ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరిగే ఈ శిబిరాన్ని భక్తులు, అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
డిజిటల్ హెల్త్ మిషన్‌పై దృష్టి సారించాలి
చిత్తూరు రూరల్(కాణిపాకం): ఆయుష్మాన్ భారత్ డిజిటిల్ మిషన్‌పై అధికారులు దృష్టి సారించాలని డీఎంహెచ్‌ఓ సుధారాణి అన్నారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో సోమవారం ఆమె శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఓపీ సేవలు ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్‌లో నమోదు కావాలని చెప్పారు. వాటిలో ప్రజల ఆరోగ్య వివరాలను కూడా నమోదు చేయించాలని సూచించారు. అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి వెంకట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ పీఎఫ్ వెబ్‌సైట్ ఆవిష్కరణ
చిత్తూరు కార్పొరేషన్: జిల్లా జెడ్పీ ఉద్యోగుల పీఎఫ్ వెబ్‌సైట్‌ను సోమవారం సీఈఓ రవికుమార్‌నాయుడు ప్రారంభించారు. జెడ్పీ కార్యాలయంలో సోమవారం సీఈఓ మాట్లాడారు. గతంలో ఉన్న వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేసినట్లు పేర్కొన్నారు. www.zppfctr.com లో ఉద్యోగులు లాగిన్ అయి వివరాలను తెలుసుకోవచ్చన్నారు. వీటిలో ఏదైనా పొరబాట్లు ఉంటే కార్యాలయంలో సంప్రదించాలన్నారు. 2021 మార్చి వరకు వివరాలు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. త్వరలో 2024 మార్చి వరకు వివరాలను సైట్‌లో ఉంచుతామన్నారు. అనంతరం వెబ్‌సైట్ అంశాల పై ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డిశేఖర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జయకాంత్, ఎస్టీయూ నాయకులు రమణ, మదన్‌మోహన్‌రెడ్డి, సోమశేఖర్‌నాయుడు పాల్గొన్నారు.
పరిశోధన ప్రదర్శనపై వర్క్‌షాప్
చిత్తూరు రూరల్(కాణిపాకం): చిత్తూరు నగరం మురకంబట్టులోని అపోలో కాలేజీలో సోమవారం పరిశోధన ప్రదర్శనపై వర్క్‌షాప్ నిర్వహించారు. అధ్యాపకులు సేతురామన్, వైద్యులు షానీ, మహేంద్రనాథ్ మాట్లాడుతూ విద్యాబోధనలో పరిశోధన అత్యంత ముఖ్యమైనదన్నారు. చేసే ప్రయోగాలను మూలన పడేయకుండా వాటి ప్రదర్శనపై దృష్టి సారించాలని సూచించారు. అలాంటప్పుడే పరిశోధన ఫలిస్తుందని వారు పేర్కొన్నారు. అనంతరం పరిశోధన ప్రదర్శనపై ప్రయోగాత్మకంగా వివరించారు.
నేడు స్కూళ్లకు ఆప్షనల్ సెలవు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు ఈ నెల 24వ తేదీ మంగళవారం ఆప్షనల్ సెలవును ప్రకటిస్తున్నట్లు డీఈఓ వరలక్ష్మి తెలిపారు. ఈ మేరకు సోమ వారం ఆమె విలేకరులతో మాట్లాడారు. క్రిస్మస్ ఈవ్ సందర్భంగా పాఠశాలలకు ఆప్షనల్ సెలవు ప్రకటించినట్లు తెలిపారు. తప్పనిసరిగా అన్ని పాఠశాలలు సెలవు ప్రకటించాలని డీఈఓ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment